ఏపీలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీకి సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్ల భర్తీని ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా చేపట్టనుంది.



గతేడాది మేనేజ్‌మెంట్ కోటాలోని 15 శాతం ఎన్నారై సీట్లు మినహా మిగతా వాటిని కన్వీనర్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. దీనిపై కొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. యాజమాన్య కోటాలో మెరిట్ ప్రకారం భర్తీ చేసినందున వీరికి బోధన రుసుములు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.



ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలకు గతంలో ఉన్న ఉత్తర్వులను నిలిపివేసి, ఆ స్థానంలో జీవో నెం. 66ని అమల్లోకి తెచ్చారు. దీని ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనుంది. యాజమాన్య కోటాకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు చేసేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.




ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. 


➤ కళాశాలల యాజమాన్యాలు ఈ వెబ్‌సైట్‌లో సీట్లు, వారికి వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 


➤ విద్యార్థులు సైతం ఆయా కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం దరఖాస్తులను సంబంధిత యాజమాన్యాలకు పంపిస్తారు.


➤ దరఖాస్తుల్లోని విద్యార్థుల మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. 


➤ విద్యార్థి ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకునే అవకాశాన్ని కళాశాలకు కల్పించడంతో ఫీజు చెల్లించగలరా? లేదా అనే ఆర్థిక పరిస్థితిని యాజమాన్యాలు పరిశీలించుకోవచ్చు.


➤ అయితే ఈ కారణంతో యాజమాన్యాలు దరఖాస్తులను తిరస్కరించే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


➤ ఇప్పటికే చాలా కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేసేసుకున్నాయి. కొన్ని కళాశాలలు కన్వీనర్ కోటా ఫీజుపై మూడింతలు తీసుకోగా.. మరికొన్ని రూ.3లక్షల నుంచి- రూ.5లక్షల వరకు అదనంగా డొనేషన్లు వసూలు చేశాయి. 


 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET -2022) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌‌ను అధికారులు విడుదల చేశారు. మొదట ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగ‌స్టు 22 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.



ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 2,82,496 మంది  హాజరుకాగా.. 2,56,983  మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో  89.12 శాతం అర్హత సాధించారు. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్షకు హాజరుకాగా.. 83,411 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 95.06 శాతం అర్హత సాధించారు.



AP EAPCET - 2022 Rank Cards 

ఇంజినీరింగ్ విభాగంలో 2,06,579 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,94,752 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,73,572 మంది క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1.48 లక్షల సీట్లను భర్తీచేస్తారు. 



ఏపీ ఈఏపీసెట్ షెడ్యూలు ఇలా..
✈ ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: ఆగ‌స్టు 22 నుంచి ఆగస్టు 30 వరకు
✈ సర్టిఫికెట్ల పరిశీలన: ఆగ‌స్టు 23 - 31
✈ కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 వరకు
✈ వెబ్ ఆప్షన్లలో మార్పు: సెప్టెంబరు 3న
✈ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 6న
✈ కాలేజీల్లో రిపోర్టింగ్‌: సెప్టెంబరు 6 - 12
✈ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..