AP TET: 'ఏపీ టెట్-2024' పరీక్ష ఫలితాలు జూన్ 25న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులు నిరాశకు గురికావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పాసైన అభ్యర్థులతో పాటు.. వీరికి కూడా త్వరలోనే టెట్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. వీరు మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అందరికీ మంచి జరగాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
58.4 శాతం అభ్యర్థులు అర్హత..
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 2,35,907 మంది హాజరయ్యారు. టెట్ పరీక్షలకు మొత్తం 2.67 లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 2.35 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో రెండు పేపర్లు కలిపి 1,37,904 మంది అర్హత సాధించారు. మొత్తం 58.4 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్లవారీగా చూస్తే.. పేపర్-1ఎ (SGT)కు 1,13,296 మంది హాజరు కాగా.. 78,142 మంది (66.32 %) అర్హత సాధించారు. ఇక పేపర్-1బి (SGT Special Education)కు 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 790 మంది (46.47 %) అర్హత సాధించారు. పేపర్ 2ఎ (School Assistant)కు 1,19,500 మంది హాజరుకాగా.. వీరిలో 60,846 మంది (50.96 %) మాత్రమే అర్హత సాధించారు. పేపర్-2బి (SA Special Education)కు 1,411 మంది హాజరు కాగా.. 1,125 మంది (79.73 %) అర్హత సాధించారు.
ఏపీటెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
అర్హత మార్కులు: మొత్తం 150 మార్కులకు వేర్వురుగా టెట్ పేపర్-1, పేపర్-2 రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా; బీసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. ఈ మేరకు ఫలితాలను అధికారులు విడుదల చేశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే.
గత వైసీపీ ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన టీడీపీ ప్రభుత్వం.. తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇంచ్చింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.
మెగా డీఎస్సీ 2024 పోస్టుల వివరాలు..
క్ర.సం. | విభాగం | పోస్టుల సంఖ్య |
1) | స్కూల్ అసిస్టెంట్ (SA) | 7725 |
2) | సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) | 6371 |
3) | ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) | 1781 |
4) | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) | 286 |
5) | ప్రిన్సిపల్స్ | 52 |
6) | ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) | 132 |
- | మొత్తం ఖాళీలు | 16,347 |