హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తున్న ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఏబీపీ దేశం (ABP Desam) విద్యా రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న కెరీర్ విధానాలపై  చర్చించేందుకు వేదికను సిద్ధం చేసింది. 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఏబీపీ నెట్‌వర్క్‌లో భాగమైన ఏబీపీ దేశం, ప్రతిష్టాత్మకమైన ‘స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ 2026’ (SmartEd Conclave 2026) ను నిర్వహిస్తోంది.

వేదిక, సమయం.. కాంక్లేవ్ ఉద్దేశంఈ సదస్సు ఫిబ్రవరి 24, 2026న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల రాడిసన్ బ్లూ (Radisson Blu) హోటల్‌లో జరగనుంది. భారత విద్యా వ్యవస్థలో సాంకేతికత, ఆవిష్కరణలు,  నైపుణ్యాల పాత్రను విశ్లేషించడం ఈ కాంక్లేవ్ ప్రధాన లక్ష్యం. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై ఇక్కడ నిపుణులు సమగ్రంగా చర్చించి తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. 

ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ సెషన్ టాపిక్స్..

ఉదయం 10:20 గంటలకు చీఫ్ గెస్ట్, ఏబీపీ దేశం బృందం జ్యోతి ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి 'తెలంగాణ విద్యా రంగ పరివర్తన' అనే అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. ఈ సదస్సులో భాగంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులపై పలు ఆసక్తికర చర్చలు జరగనున్నాయి. 'తరగతి గది నుండి కెరీర్ వరకు - నైపుణ్యాల అంతరాన్ని పూరించడం' అనే అంశంపై ప్రతీక్ శుక్లా (MASAI CEO), రాహుల్ అత్తులూరి (NxtWave CEO) చర్చించనున్నారు.

అలాగే 18 ఏళ్ల యంగ్ ఇన్నోవేటర్ ఆర్యమాన్ మహేశ్వరి తరగతి గదుల ఆధునీకరణపై, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన డిజిటల్ భారత్ కోసం సాంకేతిక విద్యను ఎలా మార్చాలో వివరిస్తారు. ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యంగ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అప్పల్ల సాయికిరణ్ 'మనీ మైండ్‌సెట్' గురించి ప్రసంగిస్తారు

మధ్యాహ్న సెషన్లలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ నిర్వహించనున్నారు. ఇందులో డాక్టర్ భరత్ భూషణ్ సింగ్, ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎల్, సయ్యద్ హమీద్ పాల్గొని భవిష్యత్తు విద్యా విధానాలపై చర్చిస్తారు. ఐసిఎఫ్ఎఐ (ICFAI) డైరెక్టర్ సుధాకర్ రావు గ్రాడ్యుయేట్ల ఉపాధి నైపుణ్యాలపై, నటి డాక్టర్ శ్రేయసి సేన్ ప్రతిభను లక్ష్యంగా మార్చుకోవడంపై అవగాహన కల్పిస్తారు. చివరగా గ్లోబల్ ఇండియన్ ఆస్ట్రోనాట్ జాహ్నవి దంగేటి అంతరిక్ష విద్య, స్పేస్ ఎకానమీ గురించి మాట్లాడతారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:00 గంటలకు విందు భోజనంతో ముగుస్తుంది

ఈ సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, అకడమిక్ లీడర్లు, పరిశ్రమ నిపుణులు మరియు ఎడ్-టెక్ (Ed-tech) ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఈ వేదిక ద్వారా రూపొందించనున్నారు. భారత విద్యా వ్యవస్థను (Education Ecosystem) బలోపేతం చేసే ఈ మేధోమథన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఏబీపీ దేశం ఆహ్వానిస్తోంది.