దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET Exam 2025) ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఒక్క నిమిషం నిబంధనను కచ్చితంగా అమలుచేశారు. కొన్నిచోట్ల తల్లీకూతుళ్లు ఇద్దరు వెళ్లి నీట్ ఎగ్జామ్ రాయగా.. ఓ చోట ఏకంగా 72 ఏళ్ల వయసున్న పెద్దావిడ సైతం నీట్ ఎంట్రన్స్ టెస్టు రాసి అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, ఆ తల్లి, ఓ పెద్దావిడ నిరూపిస్తున్నారంటూ వీరిని ప్రశంసిస్తున్నారు.

ఆదివారం జరిగిన నీట్ పరీక్షలకు ఏపీలో లో 72 ఏళ్ల పెద్దావిడ హాజరయ్యారు. ఆమె పేరు పోతుల వెంకటలక్ష్మి కాగా, కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన నీట్ ఎగ్జామ్ రాశారు. టీనేజ్ నుంచి పాతికేళ్ల వయసున్న యువత మాత్రం తమ పెన్నులు, పెన్సిల్.. హాల్ టికెట్లు సరిగ్గా ఉన్నాయో లేదోనని చూసుకుని కంగారు పడుతూ పరీక్షలకు హాజరవుతుంటారు. కానీ ఏడు పదుల వయసులో వెంకటలక్ష్మీగారు చాలా ప్రశాంతంగా కనిపించారు. 

ఎవరో ఎగ్జామర్ రాయడానికి వస్తే, వారి వెంట వెంకటలక్ష్మీ వచ్చారని మొదట ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు, గేట్ వద్ద సిబ్బంది భావించారు. కానీ హాల్ టికెట్, ఐడీ కార్డు చూపించి ఎగ్జామ్ రాసేందుకు వచ్చానని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. సల్వార్ కమీజ్ ధరించి, హాల్ టికెట్ ఎగ్జామ్ కు కావాల్సిన పెన్ను, పెన్సిల్ లాంటి వాటిని తీసుకుని కాకినాడలోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్ కు ఆమె వచ్చారు. తన మనవడినో, మనవరాలికో ఆల్ ద బెస్ట్ చెప్పేందుకు వచ్చారని భావించిన వారు విషయం తెలిసి ప్రశంసించారు. చదువుకు వయసు అడ్డంకి కాదని ఆ పెద్దావిడ నిరూపిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న ఆలోచన, ఆశయం ఉంటే ఏ వయసులోనైనా వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చునని ఆమెను చూసిన వారు అంటున్నారు.

నీట్ ఎగ్జామ్ రాసిన తల్లీకూతురు

తెలంగాణలో ఓ తల్లి, కూతురు నీట్ ఎగ్జామ్‌కు హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన భూక్యా సరిత (38) ఆర్ఎంపీగా చేస్తున్నారు. ఆమె భర్త భూక్యా కిషన్ సైతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే బీఎస్సీ చివరి సంవత్సరంలో 2007లో ఆమెకు వివాహం జరగడంతో ఎగ్జామ్ రాయలేకపోయారు. ప్రస్తుతం వీరి కూతురు ఖమ్మంలో నీట్ కు శిక్షణ తీసుకుంది. అదే సమయంలో తల్లి సరిత సైతం నీట్ ఎగ్జామ్ కు ప్రిపేయర్ అయ్యి సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎగ్జామ్ రాశారు. కూతురు కావేరి  ఖమ్మంలోని గవర్నమెంట్ స్కూల్ ఎన్ఎస్‌పీ క్యాంపు సెంటర్లో ఎగ్జామ్ రాశారు.