Social Media Flaunting Risk: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ... 'నా దగ్గర ఇన్ని తులాల బంగారం ఉంది, ఇన్ని లక్షల క్యాష్ ఉంది' అని ఫోజులిస్తే ఆ రీల్స్ చూసి లైకులు కొట్టేది కేవలం ఫాలోవర్లు మాత్రమే కాదు, స్కెచ్ వేయడానికి ఎదురుచూసే దొంగలు కూడానని మధ్యప్రదేశ్ దొంగలు మరోసారి ఫ్రూవ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ప్రముఖ విలేజ్ బేస్డ్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రచన గుర్జార్ ఇంట్లో జరిగిన దొంగతనం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. రచన గుర్జార్ రెండు రోజుల క్రితమే తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒంటి నిండా భారీ గోల్డ్ జ్యువెలరీ వేసుకుని, తళతళలాడిపోతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. సదరు రీల్‌కు లైకులు, కామెంట్లు రావడమే ఆలస్యం.. స్థానిక దొంగల కన్ను ఆ 'గోల్డ్ రీల్' మీద పడింది. ఇంకేముంది, 'లొకేషన్' ఎక్కడుందో దొంగలు ఈజీగా ట్రేస్ చేశారు. ఆమె ఇంట్లో ఏయే మూల ఏముందో రీల్స్ ద్వారానే ఒక ఐడియాకు వచ్చేసి, పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు.
అర్ధరాత్రి సమయంలో రచన గుర్జార్ నివాసంలోకి చొరబడిన దొంగలు, అత్యంత తెలివిగా ప్రవర్తించారు. రచన, ఆమె భర్త పడుకున్న బెడ్‌రూమ్ తలుపులను బయటి నుంచి లాక్ చేసేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాలను బద్దలు కొట్టి.. రెండు రోజుల క్రితం రీల్‌లో చూపించిన ఆ బంగారు నగలు, వెండి ఆభరణాలు , ఇంట్లో ఉన్న భారీ క్యాష్‌ను బ్యాగుల్లో సర్దేసుకున్నారు. దాదాపు రూ. 7 నుండి 8 లక్షల విలువైన సొత్తును నైస్‌గా సర్దేసి, తెల్లవారేసరికి పత్తా లేకుండా పోయారు.
ఉదయం లేచి చూసేసరికి బెడ్‌రూమ్ గడియ పెట్టి ఉండటం, బయటకు వచ్చి చూస్తే బీరువాలు ఖాళీగా దర్శనమివ్వడంతో ఆ దొంగల హస్తలాఘవానికి ఈ జంట బిత్తరపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. అయితే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే... ఇంట్లో అంత పెద్ద దొంగతనం జరిగినా, రచన గుర్జార్ మాత్రం తన కంటెంట్ క్రియేషన్ ఆపలేదు.
పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. ఆ వివరాలను, సీసీటీవీ అప్‌డేట్స్‌ను కూడా వరుస వీడియోల రూపంలో యూట్యూబ్‌లో షేర్ చేస్తూ వ్యూస్ రాబడుతోంది. ఈ ఘోర కలికాలంలో దొంగతనాన్ని కూడా కంటెంట్‌గా మార్చుకుని వీడియోలు చేయడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో అతిగా బిల్డప్ ఇస్తే ఇల్లే గుల్లవుతుందని ఇప్పటికైనా అర్థమైందా అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే, పోలీసుల కంటే ముందే దొంగలు మీ అప్‌డేట్స్ చూస్తున్నారు, కాస్త జాగ్రత్త అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత జీవితాలను, ఆస్తులను ప్రదర్శించే వారికి ఒక గట్టి గుణపాఠం!
