Telangana Crime News | జగదేవ్‌పూర్: యువత ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టమే. పరీక్షల్లో ఫెయిలైతే ఒకరు, ప్రేమలో విఫలమయ్యామని కొందరు, జాబ్ రాలేదనో, పెళ్లి జరగలేదనో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల గురించి తరచూ వింటూనే ఉంటాం. బీఎండబ్ల్యూ కార్ కొనివ్వలేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు జానీ (21) కొన్ని రోజులుగా బీఎండబ్ల్యు కారును కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. జానీ పదో తరగతి వరకు చదివాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. కానీ అతడి కోరికలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. బీఎండబ్ల్యూ కారు కొనిస్తావా లేదా అని పదే పదే అడగడంతో శుక్రవారం నాడు కారు షోరూంకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. 

తమ వద్ద అంత డబ్బు లేదని, కోరిన కారుకు బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కుమారుడికి కనకయ్య చెప్పాడు. తనకు నచ్చిన కారు బీఎండబ్ల్యూ కొనివ్వకపోవడంతో జానీ నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. అడిగిన కారు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి లోనైన యువకుడు జానీ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జానీని ములుగులోని ఆర్‌వీఎమ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి జానీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని పిల్లలు నడుచుకోవాలని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు పుత్రశోకం మిగల్చకూడదని సూచించారు.