Son Killed His Mother In Kothagudem: తెలంగాణలో శనివారం దారుణాలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా హతమార్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు, హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఓ బార్బర్ టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను లేకపోతే కన్నతల్లిని ఎవరూ చూసుకోరేమో అని ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని బూడిదగడ్డ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివసిస్తోన్న తుల్జాకుమారి పాసి (55)కి కుమారుడు వినయ్ కుమార్ (27), కుమార్తె హారతి ఉన్నారు. భర్త పదేళ్ల క్రితం మరణించాడు. తుల్జాకుమారి కుమార్తె హారతి, ఆమె భర్త, ఇతర కుటుంబీకులతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం తుల్జాకుమారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మందులు వాడుతున్నారు. ఆమె కుమారుడు వినయ్ గతంలో అక్కడక్కడ పని చేసి తల్లికి సాయం చేసేవాడు. అయితే, గత రెండేళ్లుగా ఏ పనీ చేయకుండా ఉండగా.. అప్పటి నుంచి బంధువులే తుల్జాకుమారి, వినయ్ కుమార్‌ల పోషణకు సాయం చేస్తుండేవారు.


అమ్మ ఒంటరి అయిపోతుందని..


వినయ్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి (హైడ్రోసెల్) గురయ్యాడు. అయితే, అలర్జీ వల్ల సర్జరీ కుదరదని కొద్ది రోజులు మెడిసిన్ వాడాలని వైద్యులు సూచించారు. కాగా, తరచూ తనకు అనారోగ్యంగా ఉందని.. బతకాలని లేదని స్నేహితులకు చెప్పేవాడు. ఇదే క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. 'తనకేమైనా అయితే మా అమ్మ ఒంటరి అయిపోతుంది. నేను లేకపోతే మా అమ్మకు తోడు ఎవరు ఉంటారు.?' అంటూ తనలో తనే మాట్లాడుకునే వాడని స్నేహితులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తల్లి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటన


అటు, ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంటర్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అల్లూరి విష్ణు (22)పై కొంతమంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ విష్ణు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హాస్టల్‌లో టీచర్ హత్య


మరోవైపు, హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎస్ఆర్ నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని షేరింగ్ రూమ్‌లో స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణతో పాటు స్థానికంగా హెయిర్ కటింగ్ షాపులో పని చేసే గణేష్ ఉండేవారు. అయితే, గణేష్ రోజూ రాత్రి మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ వెంకటరమణ మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపం పెంచుకున్న గణేష్.. కటింగ్ షాపులో వాడే కత్తితో వెంకటరమణపై శనివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి యువకులు హాస్టల్ యాజమాన్యానికి తెలియజేశారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారం కూడా హత్యకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మృతుడు వెంకటరమణ కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందినవాడుగా గుర్తించారు.