అర్థరాత్రి పూట లవర్ కి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు.  హైదరాబాద్ బోరబండ పరిధిలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. మహమ్మద్ షోయబ్‌ (19)  అనే యువకుడు బోరబండలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.

ఆదివారం అర్థరాత్రి సమయంలో షోయబ్‌ తన లవర్‌ కి పిజ్జా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. పిజ్జాను లవర్‌ కి ఇచ్చిన తరువాత ఇద్దరు మెడ మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా యువతి కుటుంబ సభ్యులు రావడం గమనించిన యువకుడు నాలుగు అంతస్తుల పై నుంచి కిందకి దూకేశాడు.

తీవ్ర గాయాల పాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. యువకుని పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతి చెందాడు.

మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిజ్జా ఇచ్చేందుకు షోయబ్ తమ ఇంటికి వచ్చాడని, ఇంతలో తాను రావడంతో ఆందోళనకు గురై భవనం పైనుంచి దూకేశాడని యువతి తండ్రి పోలీసులకు తెలిపాడు.