Young Man Died While Horse Riding: పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయం కొనసాగించాలన్న ఆ యువకుడు భావించాడు. ఈ క్రమంలో గుర్రపు స్వారీ చేస్తుండగా అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా (Kurnool District) మద్దికెర (Maddikera) మండలానికి చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు పూర్వీకుల సంప్రదాయం ప్రకారం గుర్రపు స్వారీ (Horse Riding) నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. మద్దికెరలో దసరా ఉత్సవాల్లో గుర్రంపై ఊరేగడం వారి కుటుంబ సంప్రదాయం. ఈ క్రమంలో యువకుడు గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది. పృథ్వీరాజ్ స్వారీ చేస్తుండగా వెనుక నుంచి కొందరు యువకులు అదుపు చేసేందుకు యత్నించినా గుర్రం నిలవలేదు. దీంతో అదుపు తప్పి కింద పడి యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గేట్ జారి పడి
అటు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. కాలువ గేట్ జారి పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంగారావు, రాజేశ్వరి దంపతుల కుమారుడు తొడిమిల విజయ శ్రీహర్ష (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో కొండూరు కాలువ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గేటు కింద నుంచి అటు ఇటు తిరుగుతుండగా.. అది ప్రమాదవశాత్తు కదిలి కిందకు జారడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Also Read: Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం