Woman And Young Boy Forceful Death In Visakhapatnam: ఆ మహిళ వయసు 30. ఆ యువకుడు వయసు 22. ఇద్దరిదీ ఒకే ఊరు. మంగళవారం అదే ఊరిలో ఒకటే టైంలో నిమిషాల వ్యవధిలోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా.. ఇరువురి మధ్య అక్రమ సంబంధమే దీనికి కారణమని తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా (Visakha District) పద్మనాభం (Padmanabham) మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కనకల శంకర్రావు లారీ డ్రైవర్ కాగా.. అతనికి కనకల లక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో సోమవారం లక్ష్మి.. భర్త డ్యూటీకి వెళ్లగానే తన ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత మద్ది గ్రామంలో ఉండే మరిది ఇంటికి వచ్చి చూడగా.. లక్ష్మీ ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
నిమిషాల వ్యవధిలోనే..
మరోవైపు, లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన నిమిషాల వ్యవధిలోనే.. అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య (22) గ్రామ శివారున బలవన్మరణానికి పాల్పడ్డారు. కొండల్లోని గోడౌన్‌లో ఆదిత్య ఉరేసుకోవడం గమనించిన మేకల కాపర్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఒకే రోజు ఒకే టైంలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడడం పలు అనుమానాలకు తావిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అక్రమ సంబంధమే కారణం..
ఇరువురి ఆత్మహత్యకు అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలైనట్లు సమాచారం. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. అభం శుభం తెలియని చిన్నారులు తల్లి ప్రేమకు దూరం కాగా.. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా చనిపోయాడని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసుల విచారణలో..
గ్రామంలో ఇరువురి ఆత్మహత్యలపై పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఫోన్ రికార్డింగ్స్, ఛాటింగ్స్ కీలకంగా మారాయి. కలిసి జీవించడం సాధ్యం కాదని.. చనిపోవడమే మేలని ఆదిత్య క్షణికావేశంలో ఉరేసుకోగా.. వెను వెంటనే లక్ష్మి సైతం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిత్య ఉరేసుకొనే సమయంలో లక్ష్మికి వీడియో కాల్ చేయడంతో భయపడి ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా కొండ నడిచినట్లు సమాచారం.
ఇద్దరి మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి కాగా.. మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారు గోస్తనీ నదీ తీరంలోని శ్మశాన వాటికలో 50 మీటర్ల దూరంలో విడివిడిగా దహనం చేశారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు పికెట్ నిర్వహించారు. మృతురాలు లక్ష్మి, మృతుడు ఆదిత్యలకు ఉన్న పరిచయం నేపథ్యంలో వారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని పద్మనాభం పీఎస్ సీఐ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. ఇరువురి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని.. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.