Sister Murdered Her Brothers In Palnadu Districts: ఏపీలో దారుణం జరిగింది. తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఓ మహిళ తన ఇద్దరి సోదరులను ఒకరికి తెలియకుండా ఒకరిని చంపేసినట్లు తెలిసింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో (Palnadu District) తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతి చెందగా.. ఆ కుటుంబానికి ఆయన ఉద్యోగం అనంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు పిల్లలు కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. అయితే, ఇన్ని రోజులూ అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున.. ఆ డబ్బు తనకే దక్కాలనే దురాశతో ఓ సోదరి తన అన్న, తమ్ముడిని ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించడం లేదు.


ఇదీ జరిగింది


పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు (50)కు ముగ్గురు సంతానం. భార్య కొన్నేళ్ల క్రితం చనిపోగా.. ఆయన నకరికల్లు గిరిజన సంక్షేమ స్కూల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పీఎస్‌లో కానిస్టేబుల్. రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి. పెళ్లై భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణ. కుమారులిద్దరికీ వివాహాలయ్యాయి. కానీ వీరిని భార్యలు వదిలి పుట్టిళ్లకు వెళ్లిపోయారు. అయితే, సోదరికి నకరికల్లులో ఓ ప్రియుడు ఉన్నట్లు తెలిసింది. ముగ్గురు సంతానం మధ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై వివాదాలు నడుస్తున్నాయి. కొద్ది రోజులుగా గోపీకృష్ణ పీఎస్‌లో విధులకు గైర్జాజరవుతుండగా.. ఎస్సై బాలకృష్ణ మెమో సైతం జారీ చేశారు. అయినా అటు నుంచి సమాధానం రాలేదు. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటుండగా.. ఈ నెల 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సోదరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తమ్ముడిని నవంబర్ 26న కాల్వలో పడేసి చంపేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


Also Read: Vizag Man Collecting Vintage Bikes: 1953 నుంచి లేటెస్ట్‌ టూవీలర్‌ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ