గుంటూరు: వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరు హత్యకు, మరొకరు జైలుకు వెళ్తుండటంతో పిల్లలు అనాథలు అవుతున్నారు. ఓ మహిళ ఆస్తి కోసం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసి, చివరికి అడ్డంగా దొరికిపోయింది. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు  మంగళవారం మీడియాకు వెల్లడించారు.

Continues below advertisement

అసలేం జరిగిందంటే..సత్తెనపల్లి పట్టణానికి చెందిన లక్ష్మికి 15 సంవత్సరాల కిందట గుంటూరు రూరల్ మండలంలోని పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ గోవిందరాజుతో వివాహం జరిగింది.  గోవిందరాజు కొన్నేళ్ల కిందట మద్యానికి అలవాటు పడ్డాడు. నిత్యం తాగి గొడవపడుతున్నాడని ఆరేళ్ల నుంచి లక్ష్మీ తన భర్తకు దూరంగా ఉంటోంది. క్యాటరింగ్ పనులు చేస్తున్న పెర్నేటి వెంకటేశ్వర్లు (వెంకట్)తో మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది.  ఈ క్రమంలో ఆస్తి కోసం భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది.

విలువైన ఇళ్లు, స్థలాల కోసం హత్యకు ప్లాన్తన భర్త గోవిందరాజుకు కోటిన్నర విలువైన ఇళ్లు, స్థలాలు ఉన్నాయని, అతడ్ని హత్య చేస్తే అవి మన సొంతం అవుతాయని ప్రియుడు వెంకటేశ్వర్లుకు చెప్పింది. లక్ష్మి ప్లాన్ తెలుసుకున్న ప్రియుడు వెంకట్ తన స్నేహితుడు షేక్ ఖాసిం సైదాతో కలిసి గోవిందరాజు హత్యకు ప్లాన్ చేశాడు.  సెప్టెంబరు 18న గోవిందరాజుకు మద్యం తాగించి, సాతులూరులోని పెదరెడ్డిపాలెం సమీపంలో అతడిపై దాడిచేశారు. మొలతాడు తెంచి మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. గోవిందరాజు స్పృహ తప్పడంతో చినిపోయాడనుకున్నారు. 

Continues below advertisement

లక్ష్మి తన లవర్ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలాగ చూపించాలని చెప్పింది. తరువాత గోవిందరాజును ఆటోలో తీసుకెళ్లి అబ్బూరులో రోడ్డు పక్కన పడేశారు. కొన ఊపిరి ఉన్నట్లు గుర్తించిన నిందితులు ఇనుప రాడ్‌తో కొట్టి, గొంతు పిసికి హత్య చేశారు. పెరేచర్ల-పలకలూరు రోడ్డు పక్కన మృతదేహాన్ని  పారేసి వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19న సమాచారం అందడంతో  పోలీసులకు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, గోవిందరాజు మృతదేహాన్ని చూసి ఇది హత్యగా నిర్ధారించారు. మృతుని నాలుక బయటపెట్టి ఉందని హత్య అని భావించి మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు వెల్లడయ్యాయి. ఆస్తి కోసం గోవిందరాజును హత్య చేసినట్లు అంగీకరించింది. హత్యకు ప్లాన్ చేసిన లక్ష్మిని, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.