Wife Murdered Her Husband In Kamareddy: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ మామతో కలిసి తన భర్తనే దారుణంగా హతమార్చింది. ఏమీ ఎరగనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు సదరు భార్యే నిందితురాలిగా తేల్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో రాములు అనే వ్యక్తిని భార్య మంజుల, మామ నారాయణ ఈ నెల 9న నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. అయితే, దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పాతిపెట్టారు. 


కాగా, తన భర్తను మామతో కలిసి హతమార్చిన మంజుల.. తనకు ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, దుర్వాసన వస్తుందని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కుళ్లిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అనంతరం భార్య, మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. మామతో కలిసి భర్తను హత్య చేసినట్లు మంజుల అంగీకరించింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Hyderabad News: మియాపూర్‌‌లో 144 సెక్షన్, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత