West Godavari Crime : దొంగ పోలీసు ఆట మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు సరదాగా ఆడుకుంటారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పోలీసు దొంగ అవతారం ఎత్తాడు. చేసిన అప్పులు తీర్చడానికి దొంగలా మారిపోయాడు. ఉన్న జిల్లాలో దొంగతనాలు చేస్తే అనుమానం వస్తుందని పక్క జిల్లాలో దొంగతనాలు మొదలుపెట్టాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పోలీస్ డబ్బులకు కక్కుర్తి పడిన ఘటనలు తరచూ చూస్తుంటాం. కానీ ఈ ఘటన పోలీసులకే కొత్త అనుభవాన్ని నేర్పింది. బాధ్యత గల పదవిలో ఉంటూ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తి దొంగలా మారిపోవడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు తీర్చేందుకు దొంగ అవతారం
చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఒక పోలీసు దొంగగా మారాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ దొంగగా మారిపోయాడు. కృష్ణా జిల్లా కైకలూరులో రాత్రి ఇద్దరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు. అందులో ఒకరు ఉండి పొలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ. 2018 నుంచి ఉండి పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణ విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ గా పనిచేస్తు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కైకలూరులో మహిళ మెడలోని చైన్ తెంపుకొని వెళ్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఎయిర్ పోర్టులో చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ జరిగింది. కమల అనే మహిళ నుంచి ఓ దొంగ బంగారం చైన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనలో కింద పడిపోయిన కమల తలకు తీవ్ర గాయమైంది. దొంగ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు. సాంకేతికతతో నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు అతడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన హేమంత్ గా పోలీసులు గుర్తించారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు అధికారులకు పోలీసులు నిందితుడి సమాచారం అందించడంతో ఎయిర్ పోర్టు పోలీసులు రంగంలోకి దిల్లీ వెళ్లే జెట్ఎయిర్వేస్ విమానంలో నిందితుడిని గుర్తించారు. రన్ వే పై ఉన్న విమానం వద్దకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విమానాల్లో రాకపోకలు
ఉత్తరప్రదేశ్ కు చెందిన చెందిన హేమంత్ దిల్లీలో ఉంటున్నాడు. చైన్ స్నాచింగ్ చేయటం అతడికి అలవాటు. దొంగతనాలు చేయడానికి మాత్రం కేవలం మెట్రో నగరాలను ఎంచుకుంటాడు. పోలీసుల దర్యాప్తులో హేమంత్ పై ఇప్పటి వరకు ఆరు కేసులున్నట్లు తేలింది. గొలుసు దొంగతనాలు చేసేందుకు హేమంత్ విమానాల్లోనే రాకపోకలు చేస్తాడు. ఈ విలాసవంతమైన గొలుసు దొంగను పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు.