Road Accident On ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road)పై వాటర్ ట్యాంకర్ (Water Tanker) బీభత్సం స‌ృష్టించింది. పోలీస్ అకాడమీ (Police Academy) వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ ప్రశాంత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీకెండ్ కావడంతో నగరానికి చెందిన 10 మంది విద్యార్థులు రెండు కార్లలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన స్నేహితులు.. ఫుడ్ కోర్టులో భోజనం చేసి తిరుగుపయణమయ్యారు.


శరీరాలు నుజ్జు నుజ్జు
మార్గ మధ్యలో పోలీస్ అకాడమీ వద్ద కార్లు రోడ్డు పక్కన ఆపి, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మనిషా, చంద్ర తేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ ఢీకొట్టిన వేగానికి వారి శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు గాయపడిన వారెవరికి ప్రాణాపాయం లేదని తెలిసింది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ప్రశాంత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


మద్యం తాగి డ్రైవింగ్
ప్రాధమిక విచారణలో ట్యాంకర్ డ్రైవర్ ప్రశాంత్ కుమార్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వాసిగా నిర్ధారించారు. మనిషా, చంద్ర తేజ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? మృతుల పేర్లు మినహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.