Warangal Police: రెండు వేర్వేరు సంఘటనల్లో ఎన్ఐఏ అధికారి పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితో పాటు మరో ఇధ్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆర్మీ యూనిఫారం, ల్యాప్ టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, ఒల సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వెల్లడించారు. 


నల్గొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలావాటు పడ్డాడు. ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. అందులో భాగంగానే ఆర్మీ యూనిఫారం, ఎయిర్ పిస్టల్ తో పాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకున్నాడు. గ్రామస్థులందరికీ ఆర్మీలో పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడు. ఊళ్లోని యువకులకు మర్చంట్ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు వ్యక్తుల నుండి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశాడు. శిక్షణ పేరుతో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరియర్ ఫౌండేషన్ లో చేర్పించాడు. తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువకులు.. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో వారు గొడవ చేయడంతో ఎవరి డబ్బులను వాళ్లకు ఇచ్చేశాడు. 



ఆ తర్వాత కూడా నిందితుడిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల ఎన్ఐఏ అధికారులు దేశంలో పిఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇండ్లల్లో తనీఖీలు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను చూశాడు. తాను కూడా ఎన్ఐఏ అధికారిగా మారి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. వెంటనే నకిలీ ఐడీకార్డు సృష్టించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అంతేకాకుండా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తు ఎయిర్ పిస్టల్ తో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో జైలుకు పంపిస్తానని బెదిరించిన సంఘటలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ ఎన్ఐఏ అధికారిని పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి ఆర్మీ యూనిఫారంతో పాటు ఎయిర్ పిస్టల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా.. చేసిన తప్పులన్నింటిని అంగీకరించాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహలో నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.



ఇద్దరు దారి దొపీడీ దొంగల అరెస్ట్..


మరో సంఘటనలో దారి దొపీడీ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను కేయూసి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 20 గ్రాముల బంగారు అభరణం, ఒక ద్విచక్రవాహనం, మూడు వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన గండికోట వెంకన్న, కంది అబ్బులు ఇద్దరు సేహ్నితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం నిందితులు ఈ నెల 13వ తారీకున అవుటర్ రింగ్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహన దారుడుని చంపుతామని బెదిరించి మెడలోని బంగారు అభరణాలు, మూడు వేల ఆరు వందల నగదుతో పాటు బలవంతంగా ఫోన్ పే ద్వారా మరో మూడు వేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించారు. 



పైరెండు సంఘటనల్లో నిందితులను గుర్తించి ఆరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్, కేయూసి ఇన్ స్పెక్టర్ దయాకర్, ఎస్ఐలు సతీష్, విజయ్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నర్సింగరావు, పాషా, సంపత్ తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.