Cyber Crime : ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు బ్యాంక్ సిబ్బందిని వదలడంలేదు. సైబర్ నేరాలపై కాస్త అవగాహన ఉన్న బ్యాంక్ సిబ్బంది కూడా సైబర్ నేరస్థుల వలలో చిక్కడం ఇక్కడ అసలు ట్విస్ట్.  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు పరకాల ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి.  బ్యాంకు ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, అతడి అకౌంట్ నుంచి 2 లక్షలు రూపాయలు కొట్టేశారు. దీంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగి ఇలాంటి మోసాలకు గురైతే మిగతా వారి పరిస్థితి ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 


పరకాలలో అసిస్టెంట్ మేనేజర్ కు టోకరా


పరకాల ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే సకల దేవ్ సింగ్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2,24,967 కొట్టేశారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 


"ఈ నెల 23న నాకు 8987861993 నెంబర్ నుంచి ఓ మేసేజ్ వచ్చింది. మీ ఎస్బీఐ అకౌంట్ ఈ రోజు డియాక్టివేట్ అయిపోతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి పాన్ నంబర్ అప్డేట్ చేసుకోండి అని మేసేజ్ వచ్చింది. ఈ లింక్ పై క్లిక్ చేశాను. రెండు సార్లు ఆ లింక్ పై క్లిక్ చేసి లాగిన్ అయ్యాను. అందులో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు 7431829447 నుంచి కాల్ వచ్చింది. మళ్లీ ఆ లింక్ పై క్లిక్ చేసి ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వమని చెప్పారు. నేను మళ్లీ ఆ నంబర్ కు కాల్ చేశాను. ఈసారి పాన్ కార్డు అప్డేట్ చేయమని చెప్పాడు. వాట్సాప్ లో లింక్ పంపి దాన్ని ఓపెన్ చేయమని చెప్పాడు. అతడు చెప్పిన విధంగా చేశాను. ఇలా చేసిన కాసేపటికి నా అకౌంట్ నుంచి రూ.2,24,967 వేరే అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. " అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


చాటింగ్ పేరిట చీటింగ్ 


సోషల్ మీడియా వేదికలుగా పరిచయం పెంచుకుంటుంది. ఆపై ఛాటింగ్ చేసి.. త్వరలోనే ఆ స్నేహాన్ని ఫోన్ కాల్స్ లోకి మార్చేస్తుంది. తియ్యగా మాట్లాడుతూ... కోటీశ్వరులు అయ్యే ప్లాన్ చెప్తానంటుంది. ఆమె ప్లాన్ విని ఓకే చెప్పారంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్లే. ఎందుకుంటే ముందుగా లాభాలు చూపించి ఆపై కుచ్చుటోపీ పెడుతుంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇలాగే మోసం చేసిందీ కిలాడీ లేడీ. ఒకరి వద్ద నుంచి 56 లక్షలు, మరో వ్యక్తి నుంచి 51 లక్షలు కాజేసి వారిని బ్లాక్ లో పెట్టేసింది. మోసపోయినట్లు గుర్తించిన సదరు వ్యక్తులు వేర్వేరుగా సోమవారం  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?


బంజారాహిల్స్‌కు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల టెలిగ్రామ్ వేదికగా ఓ అమ్మాయి పరిచయం అయింది. రెండు రోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై యవ్వారం కాల్స్ లోకి చేరింది. ఇలా తియ్యటి మాటలు చెబుతూ సదరు యువతి తాను ఇన్వెస్టర్ ని అంటూ నమ్మబలికింది. నాలా నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడిపోయిన వ్యక్తి ఆమె చెప్పినట్లుగానే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయించి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే మరింత కట్టాలని వివరించింది. అది నమ్మిన వ్యక్తి.. పలు దఫాలుగా మొత్తం రూ.52 లక్షలను అమెకు పంపాడు. ఆ తర్వాత నుంచి సదరు యువతి పోన్ స్విచ్ఛాఫ్ చేసింది. టెలిగ్రామ్ లోనూ అతడిని బ్లాక్ లో పెట్టింది.