Snake Smuggling Warangal: వరంగల్ నగరంలో రెండు తలల పాము రెడ్ సాండ్ బోవా అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. గ్రే మార్కెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఈ అరుదైన పాములను విక్రయించేందుకు ఒక ముఠా ప్రయత్నిస్తోందన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, ఒక సినిమా ఫక్కీలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడు రెండు సజీవమైన ఇండియన్ రెడ్ సాండ్ బోవా (Eryx johnii) పాములను బ్యాగ్‌లో దాచుకుని కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అధికారులు దాడి చేశారు. ఈ పాములకు అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో కళ్లు చెదిరే ధర పలుకుతోంది. ఒక్కో పాము నాణ్యత, బరువును బట్టి సుమారు రూ. 2 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు విక్రయిస్తారని సమాచారం. కేవలం అక్రమ సంపాదన కోసమే ఈ అరుదైన జీవులను వేటాడుతున్నట్లు విచారణలో తేలింది.
ఈ పాములకు గ్రే మార్కెట్‌లో ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణం మూఢనమ్మకాలే. వీటితో క్షుద్ర పూజలు చేస్తే అదృష్టం వస్తుందని, అపారమైన గుప్త నిధులు లభిస్తాయని కొందరు నమ్ముతుంటారు. వీటితో పాటు కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీలోనూ, లైంగిక పటుత్వానికి సంబంధించిన ఔషధాలలోనూ వీటిని ఉపయోగిస్తారన్న ప్రచారం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
నిజానికి వీటికి రెండు తలలు ఉండవు. వీటి తోక భాగం కూడా తల ఆకారంలో మొద్దుబారి ఉండటంతో వీటిని రెండు తలల పాములు అని పిలుస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటిని పట్టుకోవడం, విక్రయించడం తీవ్రమైన నేరం. ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అరుదైన జీవజాతులను స్మగ్లింగ్ ముఠా మూలాలను వెతకడంపై ఇప్పుడు దృష్టి సారించారు.
ఆపరేషన్ విజయవంతం కావడంతో స్వాధీనం చేసుకున్న పాములను, ప్యాకింగ్ సామగ్రిని, నిందితుడిని తదుపరి చర్యల కోసం వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు. ఈ రకమైన అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణుల రక్షణలో ప్రజలు కూడా సహకరించాలని, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.
