Visakhapatnam Girl Student Suicide: విశాఖపట్నం: లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. స్టూడెంట్ సూసైడ్ కేసులో పోలీసులు మంగళవారం నాడు (ఏప్రిల్ 2న) ఐదుగురిని అరెస్ట్ చేశారు. భాను ప్రవీణ్, ఉషారాణి, శంకర్ వర్మ, ప్రదీప్ కుమార్, శంకర్ రావులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ రావు వేధింపుల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు.
సారీ నాన్నా అని మెస్సేజ్ చేసి విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: కుటుంబం పరువు పోతోందన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, మీ పరువు తీస్తు్న్నందుకు సారీ నాన్నా అంటూ మెస్సేజ్ చేసి ఓ విద్యార్థిని తనువు చాలించింది. విశాఖపట్నంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో కలిసి ఫ్యాకల్టీ తనను లైంగికంగా వేధిస్తున్నారని.. అసభ్యకర, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారని చనిపోయేముందు చేసిన మెస్సేజ్ లో పేర్కొంది.
విద్యార్థిని చివరగా రాసిన నోట్ ఇదే..
‘టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, బావ. ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వు అది చాలు. ఏది ఏమైనా నీకు, బావ కి అభినందనలు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి నన్ను క్షమించండి. నా గురించి మార్చిపోండి. నన్ను క్షమించండి. పెంచి పెద్ద చేసినందుకు, బాగోగులు చూసుకున్నందుకు మీకు థ్యాంక్స్. నా చాప్టర్ ఎండ్ అయిపోయింది. నేను ఇంకా బతికుంటే మీకు చాలా సమస్యలు వస్తాయి. అందుకే వెళ్లిపోతున్నా.. అమ్మ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త.
ఇప్పుడు నేను చనిపోతే మీరు కొంతకాలం బాధపడి తరువాత మరిచిపోతారు. కానీ నీ పరువు తీసేస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్నా. ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్నా. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. వేధిస్తున్న వారిలో ఫ్యాకల్టీ సైతం ఉన్నారు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి ఫ్యాకల్టీ సైతం విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. నాతో పాటు మరికొందరు అమ్మాయిలను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వేధిస్తున్నారు. అటు కాలేజీకి వెళ్లలేక, ఇటు ఎవరికి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నాం. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మాలో ఎవరో ఒకరు చావాలి. అప్పుడే సమస్య బయటకు తెలిసి, మిగతావారికైనా న్యాయం జరుగుతుంది. నన్ను క్షమించండి నాన్నా’ అంటూ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిని మెస్సేజ్ చేసి కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి ఆత్మహత్య విషయం చెప్పకుండా, మిస్సింగ్ అని సమాచారం ఇచ్చారని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.