Visakhapatnam Crime News: కొడుకు వినడం లేదని, అప్పుచేసి మరీ రూ.3 లక్షల బైక్ కొనిస్తే.. కడుపుకోత మిగిల్చాడు..
Visakhapatnam News | కొడుకు పట్టుబట్టడంతో తండ్రి ఏకంగా రూ.3 లక్షలు అప్పుచేసి మరీ బైక్ కొనిచ్చాడు. కానీ అంతలోనే రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా, తల్లిదండ్రుల గుండెకోత మిగిలింది.

పెదవాల్తేరు: తమ ఆర్థిక స్థోమత లేదని చెప్పినా పట్టుబట్టి మరీ తల్లిదండ్రులతో అప్పులు చేయించి బైక్స్, కార్లు కొనిపిస్తున్నారు కొందరు పిల్లలు. బైక్, ఫోన్లు కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిత్యం ఏదోచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుచేసి మరీ బైక్ కొనిచ్చినా ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దసరా సందర్భంగా తల్లిదండ్రులు తమ కొనిచ్చిన ఖరీదైన బైక్ వారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరులోని మహారాణిపేటలో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అప్పు చేసి మరీ బైక్ కొనుగోలు..
మహారాణిపేటకు చెందిన శ్రీనివాసరావుకు ఒక కుమారుడు హరీష్ (19), కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీష్ ఇటీవల ఇంటర్ పూర్తిచేసి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తనకు బైక్ కావాలని తండ్రిని అడిగాడు హరీష్. తనకు ఆర్థిక స్థోమత లేదని, బైక్ కొనివ్వడానికి డబ్బులు లేవని చెప్పడంతో హరీష్ నిరాశ చెందాడు. తండ్రి ఎంత చెప్పినా, ఆ మాటలు వినిపించుకోలేదు. తనకు కచ్చితంగా బైక్ కావాలని పదేపదే అడగటంతో శ్రీనివాసరావు ఏకంగా రూ.3 లక్షలు అప్పు చేసి మరీ దసరా రోజున కుమారుడు హరీష్‌కు బైక్ కొనిచ్చారు.
అంతలోనే విషాదం..
ఆదివారం (అక్టోబర్ 5న) అర్ధరాత్రి టిఫిన్ చేయడానికి హరీష్ తన ఫ్రెండ్ వినయ్‌తో కలిసి కొత్త బైక్‌పై ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెళ్లాడు. టిఫిన్ తిన్నాక వినయ్‌ని ఇంటివద్ద డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చాలా వేగంగా వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ టర్నింగ్ వద్ద బైక్ కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్ కు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో కేజీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం (అక్టోబర్ 6న) ఉదయం హరీష్ మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న వినయ్‌కి స్వల్ప గాయాలయ్యాయి. హరీష్ మృతదేహానికి కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి తరువాత కుటుంబానికి అప్పగించారు. ఎంతగానో అడగటంతో అప్పుచేసి మరీ కొనిచ్చిన బైక్ కొడుకు ప్రాణం తీసిందని హరీష్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు కోరిక అతడి ప్రాణం తీసిందని తల్లిదండ్రులు అన్నారు.






















