తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న విశాఖలో జరిగినట్టుగానే ఇవాళ బెజవాడలో కిడ్నాప్ సంచలనంగా మారుతోంది. ఆర్ధిక లావాదీవీలు కారణంగా బెజవాడ కేంద్రంగా జరిగిన కిడ్నాప్ వ్యవహరాన్ని పోలీసుల అత్యంత చాకచక్యంగా బయపెట్టారు.
బెజవాడలో వెలుగు చూసిన కిడ్నాప్ కేసులో మాజీ హోంగార్డుతోపాటుగా మరో ఇద్దరు మహిళలను కూడా పోలీసలు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు గురైన చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేర్చారు. తమ బిడ్డను చూసుకున్న ఆ ఫ్యామిలీతోపాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
విజయవాడలోని భవానీపురం గాంధీబొమ్మ రోడ్డులో గోపీకృష్ణ, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి బీటెక్ చదివే కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. గోపీకృష్ణ హైదరాబాద్‌లో ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలే భవానీపురంలో కుటుంబంతో వచ్చి అద్దెకు నివాసం ఉంటున్నారు. వ్యాపారం చేసే సమయంలో స్థానింకగా దుర్గా నగర్‌కు చెందిన లింగం దేవేందర్ అలియాస్ దేవేంద్రతో పరిచయం ఏర్పడింది. వారి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి.
పోలీస్ అంటూ బెదిరింపులు
దేవేందర్ 2012లో హోంగార్డుగా విధుల్లో చేరాడు. 2022లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కేసులో దేవేందర్ పాత్ర ఉందని తేలడంతో దేవేందర్‌ను అరెస్టు చేసి విధుల నుంచి తొలగించారు పోలీసులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందిని నమ్మించి వసూళ్ళకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
కిడ్నాప్ కోసం స్పెషల్ రెక్కి...
ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కృష్ణా జిల్లా పామర్రువాసి వనంబత్తిన బుజ్జిబాబు, గూడూరువాసి ఊస సుభాషిణి, తూలిమేలు మంగారాణితో పాటుగా మరి కొందరు దేవేందర్‌కు రూ.15 లక్షలు ఇచ్చారు. ఉద్యోగాలు రాకపోయేసరికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోగా, తాను పోలీస్ అంటూ దేవేందర్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలోనే గోపీకృష్ణతో దేవేందర్‌కు పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరి మధ్య జరిగిన లావాదేవీల్లో గోపీకృష్ణ వద్ద బాగా డబ్బులు ఉన్నాయని గ్రహించిన దేవేందర్ కన్నింగ్ ప్లాన్ వేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని వేధిస్తున్న వారికి డబ్బులు ఆశ చూపి కిడ్నాప్ స్కెచ్ వేశాడు.
గోపీకృష్ణ కుమారుడిని కిడ్నాప్ చేస్తే అందరూ సెటిల్ అయిపోవచ్చని నమ్మించాడు. రావాల్సిన దాని కంటే ఎక్కువ వసూలు చేసుకోవచ్చని తన మనసులో ఉన్న ప్లాన్ అంతా వివరించాడు. దీని కోసం పక్కాగా రెక్కీ కూడా నిర్వహించిందీ ముఠా.
ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకుపోయారు..
భవానీపురంలో గోపీకృష్ణ ఉంటున్న ఇంటికి దేవేందర్, బుజ్జిబాబు, సుభాషిణి, మంగారాణి వెళ్లారు. గోపికృష్ణ కోసం భార్యను అడగ్గా బయటకు వెళ్ళారని చెప్పింది. అదే సమయంలో కుమారుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఎవరూ చూడటం లేదని గ్రహించిన ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో గోపీకృష్ణ భార్య రమాదేవి కంగారు పడింది. భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. అంతా కలిసి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు.
50లక్షలు డిమాండ్...
కాసేపటికి గోపీకృష్ణకు ఫోన్ చేసిన దేవేందర్ ముఠా రూ.50 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తామని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. భయపడిన గోపీకృష్ణ భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహరం పోలీస్ కమిషనర్ వరకు వెళ్ళింది. బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ పరిశీలించారు.
సెల్ పోన్ సిగ్నల్ పరిశీలిస్తే కిడ్నాప్ ముఠా ఎక్కడ ఉందో తెలిపోయింది. వెంటనే కృష్ణా జిల్లా గూడూరు పోలీసు స్టే షన్ పరిధిలోని తుమ్మలపాలెం వెళ్లి కిడ్నాపర్లను అరెస్టు చేశారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండులకు అప్పగించారు. దీంతో అటు బాలుడి ఫ్యామిలీతోపాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.