Counterfeit Printing Machines Laptops Seized Anantapur: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ నోట్ల  ముఠాలు సరిహద్దులు దాటి నెట్‌వర్క్ విస్తరిస్తున్న ఉదంతం ఒకటి వెలుగుచూసింది. అనంతపురం నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగ నోట్ల తయారీ కేంద్రాన్ని విజయవాడ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా దాడి చేసి బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్‌లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. సామాన్య ప్రజలను ముంచేలా భారీ ఎత్తున కరెన్సీని ముద్రించి మార్కెట్లోకి వదిలేందుకు ప్రయత్నించిన ఈ ముఠా గుట్టును సైబర్, ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు రట్టు చేశారు.

Continues below advertisement

అనంతపురం  నగరంలోని వన్‌టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శారదా నగర్‌లోని ఒక నివాస గృహంలో ఈ దొంగ నోట్ల ముద్రణ సాగుతోంది. నమ్మదగిన సమాచారంతో ప్రత్యేకంగా రంగంలోకి దిగిన విజయవాడ స్పెషల్ పోలీస్ టీమ్.. గురువారం రాత్రి హఠాత్తుగా సదరు ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సమయంలో రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో హై క్వాలిటీ పేపర్లపై నోట్లను ప్రింట్ చేస్తున్న అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ నకిలీ నోట్ల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు తేలింది. అనంతపురానికి చెందిన ఈ ఇద్దరితో పాటు విజయవాడకు చెందిన మరికొందరు కీలక వ్యక్తులు ముఠాగా ఏర్పడి, ఈ నకిలీ కరెన్సీని రాష్ట్రవ్యాప్తంగా వివిధ వ్యాపార కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

పోలీసులు జరిపిన ఈ విస్తృత సోదాలలో నిందితుల రూమ్ నుండి దొంగ నోట్లను ముద్రించేందుకు ఉపయోగించే అత్యాధునిక కలర్ ప్రింటింగ్ మిషన్లు , స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నోట్ల డిజైనింగ్, సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ కోసం వాడిన ఒక ల్యాప్‌టాప్, నిందితుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లను,  భారీ మొత్తంలో ముద్రించి సిద్ధంగా ఉంచిన నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. సాంకేతిక ఆధారాల కోసం ల్యాప్‌టాప్, ఫోన్ల డేటాను నిపుణుల విశ్లేషణకు పంపారు.

Continues below advertisement

ఈ కేసు విజయవాడ పరిధితో ముడిపడి ఉండటం , అక్కడి నుంచే ప్రధాన నిందితులకు ఆదేశాలు అందుతుండటంతో.. అరెస్ట్ చేసిన రాజు, సురేష్‌లను విజయవాడ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం భారీ భద్రత నడుమ విజయవాడకు తరలించారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరికి కరెన్సీ కాగితాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఇప్పటివరకు మార్కెట్లోకి ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీని చొప్పించారు? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పండుగల సీజన్ మరియు వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగే సమయంలో ఇలాంటి నోట్లు మార్కెట్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థకు, సామాన్య వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజలు కూడా నగదు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.