Vijayawada gold chit Scam: చిట్ ఫండ్ మోసాల గురించి తరచూ వింటూంటాం. అయినా చాలా మంది మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ చిట్స్ వేసే వాళ్లు అందరూ నమ్మకస్తులే అయి ఉంటారు. వీరు దారి తప్పిదే ఆ డబ్బులన్నీ గంగలో కలసిపోతాయి. కట్టిన వాళ్లంతా రోడ్డున పడాల్సిందే. ఈ చిట్ ఫండ్ వ్యాపారులు రకరకాల స్కీముల పేర్లతో నమ్మించి ఖాతాదారులను ముంచేస్తున్నారు. విజయవాడలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది.  

విజయవాడలో ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. విదేశాలకు పార్శిల్స్ కూడా పంపిస్తాడు. క్రమంగా అందరి నమ్మకం పెంచుకున్నాడు. మంచి మాటకారి కావడంతో అందరూ నమ్మారు. మొదట్లో చిట్స్ వేసిన వారందరికీ క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించేవాడు. అయితే బిజినెస్ రేంజ్ పెంచుకోవాలని.. డబ్బులతో కాకుండా.. బంగారంతో చిట్ వేయాలని కొత్త ఆలోచన చేశాడు. అంటే అందరూ డబ్బులు కట్టాల్సిన పని లేదు. డబ్బలు కట్టాలంటే.. ఆ రోజున ఉన్న బంగారం మార్కెట్ ధర ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే బంగారం తెచ్చి ఇవ్వాలి. 

ఇలా బంగారం స్కీమ్ ప్రారంభించారు. అది 120 గ్రాముల బంగారం చిట్. చాలా మంది కట్టాలు. అయితే చివరి వరకూ ఎవరూ తీసుకోవడం లేదు. అందరూ డబ్బులు కడుతున్నారు. ఇదేదో బాగుందని అనుకునిచివరి వరకూ అందరి దగ్గర బంగారం తీసుకుని.. ఓ రోజు కనిపించకుండా పోయాడు. దీంతో డబ్బులు, బంగారం కట్టిన వాళ్లందరి గుండెల్లో రాయి పడింది. ముచ్చర్ల శ్రీనివాస్ కోసం ఎక్కడ చూసినా దొరకలేదు. దీంతో అందరూ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. మా డబ్బులు మాకు ఇప్పించాలని.. మా బంగారం మాకు ఇప్పించాలని పోలీసుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. 

ప్రైవేటు చిట్స్ వేయడం చట్ట విరుద్ధం. కానీ కంపెనీల్లో చిట్స్ వేస్తే వారు ష్యూరిటీల పేరుతో హరాస్ చేస్తారు. కమిషన్లు తీసుకుంటారు. ఈ కారణంగా ఎక్కువ మంది కంపెనీల్లో చిట్స్ వేయడం కన్నా..నమ్మకస్తుల దగ్గర చిట్స్ వేస్తూ వస్తున్నారు. కానీ ఇలాంటి వారు చేసే మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. చిట్స్ పాడుకున్న వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా.. అధిక వడ్డీల పేరుతో ఆశ చూపి.. మొత్తానికి బిచాణా ఎత్తేస్తున్నారు. ఫలితంగా మోసపోయేవాళ్లు పెరిగిపోతున్నారు. 

పెట్టుబడిదారులు ఏదైనా చిట్ ఫండ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో చేరే ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వంటి నియంత్రణ సంస్థల వద్ద ఆ సంస్థ రిజిస్టర్ అయిందో లేదో తనిఖీ చేయాలి. ఇలాంటి కంపెనీలు మూతపడవని కాదు..కానీ మూతపడితే చట్టపరమైన రక్షణ ఉంటుంది.  ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల వద్ద చిట్ వేయడమే చెల్లదు కాబట్టి.. అతన్ని పోలీసులు పట్టుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. దొరికినా రికవరీ చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ఇలాంటి స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లేకపోతే.. దాచుకున్న డబ్బు మోసగాళ్ల పాలవుతుంది.