ACB Court Granted Bail To Jogi Rajeev In Agrigold Lands Issue: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు (Jogi Rajeev) ఊరట లభించింది. ఆయనకు, సర్వేయర్ రమేష్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.


ఇదీ వివాదం


ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో (Ambapuram) ఆర్ఎస్ నెం.69/2, రీసర్వే నెం.87లో అగ్రిగోల్డ్‌ భూములను ఏపీ సీఐడీ ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. ప్లాట్ల రూపంలో ఉన్న సుమారు 2,300 గజాల భూమిని సీజ్ చేసింది. ఇలా వివాదంలో ఉన్న భూములను జోగి ఫ్యామిలీ అప్పనంగా కాజేసిందని ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్‌ బాబాయ్ అయిన వెంకటేశ్వరావు, జోగి కుమారుడు రాజీవ్ కలసి వీటిని నొక్కేసినట్లు ప్రధాన అభియోగం. ఒకరి పేరు మీద 1,086 గజాలు, మరొకరి పేరు మీద 1,074 గజాలు రాయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇది డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తే సమస్య అవుతుందని గ్రహించిన జోగీ కుటుంబం... పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించినట్టు.. వాళ్ల వద్దే కొన్నట్టు పత్రాలు సృష్టించారనే విమర్శలున్నాయి.  


కాగా, దీనిపై విచారించిన ఏసీబీ అధికారులు ఈ నెల 13న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించి ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 


ఆ పిటిషన్‌పై తీర్పు ఆ రోజే..


మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఆయన రెండుసార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఆయన్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.


పిన్నెల్లికి బెయిల్


అటు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakirshna Reddy) సైతం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని.. పాస్ పోర్ట్ అప్పగించాలని తెలిపింది. అలాగే, ప్రతీ వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పాల్వాయిగేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో ఆయన అరెస్టై.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూన్ 26 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.


Also Read: Achuthapuram SEZ: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు