ఏకంగా ఎస్బీఐలోనే నకిలీ నోట్లు లభ్యం కావడం కలకలం రేపింది. యూపీ ఫుఖారాయంలోని ఎస్బీఐ శాఖ నుంచి కొన్ని నకిలీ నోట్లను ఆర్బీఐకి పంపించింది. దీన్ని గమనించిన ఆర్బీఐ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంబంధిత బ్యాంక్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే.?
ఉత్తరప్రదేశ్ భోగని పుర్ పరిధిలోని పుఖారాయం ఎస్బీఐ శాఖ నుంచి కొంత నగదును ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించారు. వీటిని పరిశీలించిన ఆర్బీఐ అధికారులు అందులో కొన్ని నోట్లు ఫేక్ గా తేల్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలని సంబంధిత శాఖను ఆర్బీఐ కోరింది. అయితే, సంబంధిత ఎస్బీఐ శాఖ వారు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆర్బీఐ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు ముందు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నమోదు చేశారు. ఆర్బీఐ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు భోగనిపుర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ప్రమోద్ కుమార్ శుక్లా తెలిపారు. త్వరలోనే నోట్ల నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
నకిలీ నోట్లను గుర్తించండిలా.!
నకిలీ నోట్లతో సామాన్యులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నకిలీ నోట్లున్నాయని తెలిస్తే ఆందోళనకు గురి కాక తప్పదు. అయితే, నోట్లు ఒరిజినలో, కాదో అని తెలుసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అన్ని భారతీయ కరెన్సీ నోట్లలో వాటర్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. అది నిర్దిష్ట కాంతిలో పెడితే కనిపిస్తుంది. ఈ వాటర్ మార్కులో మహాత్మా గాంధీ చిత్రాన్ని నోటుకు ఎడమవైపున చూడొచ్చు.
- కరెన్సీ నోట్లు సెక్యూరిటీ థ్రెడ్ కలిగి ఉంటాయి. పేపర్ లో థ్రెడ్ పొందు పరచడం సహా దానిపై ఆర్బీఐ, నోట్ డినామినేషన్ ముద్రించి ఉంటుంది. కాంతితో ఈ థ్రెడ్ రంగు మారుతుంది.
- నిజమైన భారతీయ కరెన్సీ నోట్లు పదునైన, స్పష్టమైన గీతలతో ఉన్నతంగా ఉంటాయి. ఇండియన్ కరెన్సీ నోట్లలో సీ-త్రూ రిజిస్టర్ ఉంటుంది. నోటు ముందు వెనుక భాగంలో ముద్రించిన నోటు విలువ చిన్న చిత్రం కాంతి పడినప్పుడు కచ్చితంగా సమానంగా ఉంటుంది.
- భారతీయ కరెన్సీ నోట్లలో సూక్ష్మ అక్షరాలు, భూతద్దంలో చూడగలిగేలా ఉంటాయి. కానీ, నకిలీ నోట్లపై అస్పష్టంగా లేదా మసకబారి ఉండే అవకాశం ఉంటుంది.
- నిజమైన భారతీయ కరెన్సీ నోట్లు అధిక నాణ్యత కాగితంపై ముద్రిస్తారు. కాగితంపై కూడా ప్రత్యేక ఆకృతి కలిగి ఉంటుంది. నకిలీ నోట్లు మృదువుగా లేదా జారేలా అనిపించవచ్చు.
- ఇండియన్ కరెన్సీ నోటుపై ప్రత్యేక క్రమ సంఖ్య ముద్రించి ఉంటుంది. ఇది నోటుకు రెండు వైపులా ఒకేలా ఉందని నిర్ధారించుకోవాలి. సైడ్ ప్యానెల్ లో ముద్రించిన క్రమ సంఖ్యతో సరిపోలుతుందనేది చూసుకోవాలి.
2016కు ముందే ఎక్కువ
2016లో నోట్లు రద్దు చేయడానికి ముందే నకిలీ నోట్ల బెడద ఎక్కువగా ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. 2016 నవంబరులో డిమానిటైజేషన్ తర్వాత ఫేక్ నోట్స్ నివారణకు బహుళ పొరలతో ఉన్న నూతన నోట్లు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కొన్ని చోట్ల ఎక్కడో ఒక దగ్గర నకిలీ నోట్ల వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది.