Gun fire at Khajana Jewellers in Chandanagar | హైదరాబాద్: చందానగర్ లో కాల్పులు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు చందా నగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులకు తెగబడ్డారు. జువెలర్స్ షాపులో పనిచేసే సిబ్బందికి బుల్లెట్ గాయాలు కాగా, వారిని చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీకి వచ్చిన దుండగులు డిప్యూటీ మేనేజర్ కాళ్లపై కాల్పులు జరిపారు. రెండు రౌండ్ లు కాల్పులు జరిపి నిందితులు జహీరాబాద్ వైపు పారిపోయారు. సిబ్బందితో పాటు షాపులోని సీసీ కెమెరాలపై సైతం ఫైరింగ్ చేశారు. సరిహద్దు జిల్లాలలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ కాల్పుల ఘటనపై సైబరాబాద్ సీపీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.