Two students lost their lives in LB Nagar accident: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు మధ్యతరగతి కుటుంబాల్లో తీరని చీకటిని నింపింది. మద్యం మత్తులో, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ హోండా సిటీ కారు కాలేజీ విద్యార్థులైన శివ, సందీప్ జోహెల్ ప్రాణాలను బలిగొంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని, వీరి బైక్‌ను ఢీకొన్న కారు.. సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టిందంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత భీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతివేగం, నిర్లక్ష్యం కలగలిసి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందిన శివ గాథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న శివ, తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. తండ్రి లేకపోయినా తనను చదివిస్తున్న తల్లికి భారమవ్వకూడదని, చదువుకుంటూనే పార్ట్ టైమ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు బాగుపడతాడని.. జీవితంలో పైకి ఎదుగుతాడని ఆశపడిన ఆ తల్లికి, ఇప్పుడు కొడుకు విగతజీవిగా మారడం పెను విషాదంగా మారింది.
ఘటనా స్థలంలో శివ తల్లి రోదనలు అక్కడున్న వారిని కలచివేసాయి. నాయనా.. నా కష్టం చూడలేక డెలివరీ బాయ్‌గా వెళ్లావా నిన్ను చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకుంటే ఇలా అనాథను చేసి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. మద్యం మత్తులో ఎవరో చేసిన తప్పిదానికి, రెక్కాడితే గానీ డొక్కాడని ఓ పేద తల్లి సర్వస్వాన్ని కోల్పోయింది. శివతో పాటు ప్రాణాలు కోల్పోయిన సందీప్ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల ప్రాథమిక విచారణలో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నిందితులు మద్యం మత్తులో వాహనాన్ని అదుపు చేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఒకరి సరదా, మరొకరి ప్రాణాలకు శాపంగా మారడం.. కష్టపడి పైకి వస్తున్న విద్యార్థుల జీవితాలు ఇలా రోడ్డు పాలు కావడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
