Love Failure Attack on Student: తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరంలో ఒక ఉన్మాది ఘాతుకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుచిరాపల్లిలోని ఖాజామలై ప్రాంతంలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వద్ద బుధవారం సాయంత్రం ఒక యువకుడు యువతిపై దాడి చేస్తున్న దృశ్యాలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నవీన్ అనే యువకుడు, అమల అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నారు. అమల ప్రస్తుతం ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
పెళ్లికి నిరాకరణ - పక్కా ప్లాన్‌తో దాడి
నవీన్ తనను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అమలపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, కులాలు వేరు కావడం వల్ల తన ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించరని, అందుకే మనం విడిపోవడమే మంచిదని అమల అతనికి తెగేసి చెప్పింది. బ్రేకప్ చెబుదామని ఆమె అనడంతో నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని భావించిన నవీన్, మాట్లాడదామని పిలిచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపానికి రప్పించాడు. అక్కడ మరోసారి పెళ్లి గురించి గొడవ జరగడంతో, ఒక్కసారిగా తన వద్ద ఉన్న రాళ్లతో ఆమె తలపై బలంగా బాదాడు.
ఉన్మాదికి దేహశుద్ధి
అమల తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ప్రాణాల కోసం అరుస్తున్నా, నవీన్ కనికరం లేకుండా ఆమెను బూతులు తిడుతూ దాడిని కొనసాగించాడు. ఈ భయానక దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. అయితే, పరిస్థితి విషమిస్తోందని గమనించిన స్థానికులు వెంటనే తేరుకుని నవీన్‌ను చుట్టుముట్టారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయిన అమలను వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నిందితుడు నిందితుడు నవీన్ ఒక ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గతంలోనూ ఇతను అమలను వేధించినట్లు సమాచారం. నిందితుడిపై హత్యాయత్నం, మహిళా వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
