Uday Krishna Reddy Remand Report Upparpally Court: హైదరాబాద్  సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ  లో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎన్. ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయనను రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆగస్టు 11 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.       

Continues below advertisement

ట్రైనీ మహిళా ఐపీఎస్ తీవ్ర ఆరోపణలు               

పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ఉదయ్‌కృష్ణారెడ్డిపై తోటి మహిళా ఐపీఎస్ అధికారిణి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయిన ఈ కేసు విచారణలో, నిందితుడు పలు మార్లు బాధితురాలిని లైంగికంగా వేధించాడని, అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో పాటు తోటి అధికారుల వద్ద తీవ్రంగా అవమానించాడని తేలింది. ఆమె అనుమతి లేకుండా ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి, బెదిరింపులకు  పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచారు.      

Continues below advertisement

పరారీ అయ్యేందుకు ప్రయత్నం                               

ఈ కేసు దర్యాప్తులో ఉదయ్‌కృష్ణారెడ్డి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని, ఉద్దేశపూర్వకంగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు యత్నించారని రిమాండ్ నివేదిక స్పష్టం చేసింది. తన ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు, అదుపులోకి తీసుకునే సమయంలో అధికారులపై తిరుగబడ్డారని అరెస్టును అడ్డుకునేందుకు  ప్రయత్నించారని విచారణాధికారులు వెల్లడించారు. నేర తీవ్రత దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తుడిచిపెట్టే లేదా బాధితురాలిని బెదిరించే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు.                

ఇప్పటికే సస్పెండ్ చేసిన ట్రైనింగ్ అకాడెమీ         

కాగా, నేషనల్ పోలీస్ అకాడమీ అంతర్గత విచారణ కమిటీ కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అకాడమీలోని సిసిటివి   ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడిపై నమోదైన ఆరోపణల్లో వాస్తవం ఉందని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ అంతర్గత నివేదిక ఆధారంగా అకాడమీ యాజమాన్యం ఉదయ్‌కృష్ణారెడ్డిని ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎంతో శ్రమించి ఐపీఎస్‌గా ఎంపికై సంచలనం సృష్టించిన ఉదయ్‌కృష్ణారెడ్డి.. ఇలా క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలుపాలు కావడం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. భారతీయ నాయ్య సంహిత,  సమాచార సాంకేతిక చట్టం కింద నమోదైన పలు సెక్షన్ల ప్రకారం నిందితుడిపై దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు.