Tirupati News: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వాలంటీర్ రెచ్చిపోయాడు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా చొరవ చూపించాల్సిన వాలంటీర్ పేదలకు అందించిన ఇంటి స్ధలంను రెవెన్యూ అధికారితో చేతులు కలిపి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే విషయం తెలుసుకున్న బాధితులు వాలంటీర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. బాధితులపై దాడికి పాల్పడ్డాడు. బాధిత దంపతుల ఇద్దరిపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే వాలంటీర్ దౌర్జన్యంపై భాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాధితులు మాట్లాడుతూ.. చంద్రగిరి మండలం కల్ రోడ్ పల్లి దళితవాడలో వాలంటీర్ దౌర్జన్యం శృతిమించుతూ ఉందని బాధితులు టి.ఈశ‌్వరి, టి.రామకృష‌్ణ  తెలిపారు. అలాగే తమకు సర్కారు ఇచ్చిన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించిన వాలంటీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.


జాతీయ రహదారి నిర్మాణంలో తమ ఇంటి స్థలం పోవడంతో ప్రభుత్వం తమకు కల్ రోడ్ పల్లి దళితవాడలో ఇంటి స‌్థలం కేటాయించిందని వివరించారు. అయితే ఇంటి నిర్మాణానికి స్థోమత లేక తిరుపతిలో అద్దె ఇంట్లో ఉంటూ రోజు వారి కూలీగా పని చేసుకుంటున్నామని చెప్పారు. 2023 జనవరిలో తాము నిర్మించుకోవటానికి పట్టా మంజూరు చేయాల్సిందిగా చంద్రగిరి తహసీల్దారు శిరీషకు, కల్ రోడ్ పల్లి గ్రామ రెవెన్యూ అధికారికి వినతి పత్రాలు అందించామని వివరించారు. అయితే దళితవాడ గ్రామానికి చెందిన గౌతమ రావు అనే వాలంటీరు తమ స్థలానికి గ్రామ రెవెన్యూ అధికారి వెంకన్న నాయుడుతో కలిసి ఆ స్థలంపై పొజిషన్ సర్టిఫికెట్ తీసుకొని ఆక్రమించుకోవడానికి పూనుకున్నారని, రేకుల షెడ్డు నిర్మాణానికి సిద్ధ పడుతుండగా తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన గౌతమ్ రావు..తమను తరిమి తరిమి కొట్టాడని చెప్పారు. రక్తం ధారగా కారుతున్నా ఆపకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ ఇంటి స్థలాన్ని వాలంటీర్ నుంచి తమకు  ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. అలాగే వాలంటీర్ వలన తమకు ప్రాణభయం ఉందని భయాదోళన వ్యక్తం చేశారు.


వైసీపీ నేత ఆదేశాలతో వాలంటీర్ అరాచకం


రెండు, మూడు నెలల క్రితం కోనసీమ జిల్లాలోనూ ఓ వాలంటీర్ అతి ప్రదర్శించాడు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలోని మూడో సచివాలయ పరిధిలోని ఓ వీధిలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి ఓ వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని ఆరుబయట ఉంచారు. అయితే మార్చి ఒకటో తేదీ కావడంతో ఉదయం పింఛన్ పంపిణీ చేపట్టిన ఆ ప్రాంత వాలంటీరుకు స్థానికంగా ఉన్న ఓ వైసీపీ నాయకుడు మృతదేహం వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వాలని ఆదేశించాడు.  బయోమెట్రిక్‌ తెచ్చి అందరూ చూస్తుండగానే మృతదేహం వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్‌ వేసి పింఛను పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో అదే నాయకుడు కలుగజేసుకుని మరీ ఇది సద్దుమణిగేలా చేశాడట. వాలంటీరు నిర్వాకంపై సర్వత్రా విశ్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సదరు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వాలంటీరును వివరణ కోరారు. దీనిపై విచారణ చేస్తున్నామని, మృతదేహానికి బయో మెట్రిక్ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ జి. సరోవర్ వెల్లడించారు. రెండు, మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో వాలంటీర్ పై చర్యలు కూడా తీసుకున్నారు.