తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి లడ్డూ కౌంటర్ నిర్వహుకుడు కౌంటర్ కు తాళాలు వేయకుండా నిద్రస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కౌంటర్ లో ప్రవేశించి నగదును అపహరించాడు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా అనుమానితుడిని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మరిచి పోయి కౌంటరులోనే నిద్ర పోయాడు. ఉదయం నిద్ర లేచి చూసే సరికి నగదు సంచి కనిపించక పోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది.. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 28న తిరుమలలో రథసప్తమి
జనవరి 28న సూర్యభగవానుడి జయంతి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమి వేడుకల సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు మాఢ వీధుల్లో విహరిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
వాహన సేవలు ఇలా..
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) - సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనం
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం రోజున 70,413 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 32,206 మంది తలనీలాలు సమర్పించగా, 3.37 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 10 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనంకు 18 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.