Tiger Attack in Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం వేమలి గ్రామ పొలిమేరల్లో పశువుల శాలలో కట్టి ఉన్న ఆవు పై పులి దాడి చేసింది. సమీపంలోని మామిడి తోటలోకి ఆవును లాక్కొని వెళ్లి ఆవు పై దాడి చేసినట్లు రైతులు గుర్తించారు. ఆవును వెతికే క్రమంలో మామిడి తోటలో చనిపోయి పడి ఉన్న ఆవును  యజమాని గుర్తించాడు. దీంతో పరిసర ప్రాంతాలైన వేమలి, రంగుపురం, ముచ్చర్ల, కొత్తవలస గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు  జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలో ఎవరు ఒంటరిగా తిరగొద్దంటూ సమీప గ్రామాల్లో దండోరా వేయించారు.




మొన్నటి వరకు బెంగాల్ టైగర్ కలకలం.. 


విజయనగరం జిల్లాలో గ‌త కొంత‌కాలంగా కొండ ప్రాంతాల్లో బెంగాల్ టైగ‌ర్ సంచారం క‌ల‌క‌లం రేపుతోంది.  పులి సంచారంతో విజ‌య‌న‌గ‌రం అట‌వీ ప్రాంత ప్రజ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అట‌వీశాఖ అధికారులు పులి పాద‌ముద్రలు, ఆన‌వాళ్లు సేకరించారు. ఇటీవ‌లే తెర్లాం మండ‌లం, గొరుగువ‌ల‌స గ్రామంలో ఆవుదూడ‌పై దాడి చేయడంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. పులి రోజుకో ప్రాంతంలో మూగజీవాలపై దాడి చేస్తుంది. పులిని పట్టుకునేందుకు అట‌వీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫ‌లితం లేదు. ప్రస్తుతం వంగర మండలంలో రాయల్ బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు పాల‌కొండ డివిజ‌న్ అట‌వీశాఖ అధికారులు. వంగ‌ర ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని రెవెన్యూ శాఖ గ్రామాల్లో దండోరా వేయించింది.  పంట పొలాల్లోకి ప‌నుల కోసం వెళ్లే రైతాంగానికి హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. ఇటీవ‌లే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న బెంగాల్ టైగ‌ర్ వీడియోల‌ను చూసి పులి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. పులి కోసం అట‌వీ శాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.  


ఏనుగులు, ఎలుగుబంట్లు ఇప్పుడు పులి..


మొన్నటి వరకు ఏనుగులు, ఎలుగుబంట్లు ఇప్పుడు పులి భయంతో ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటనే భయపడుతున్నారు. ఇటీవల ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. మరోపక్క ఏనుగులు ఏ రాత్రి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా  పులి అడుగులు కనిపించడంతో గ్రామంలో  ప్రజలందరూ వణికిపోతున్నారు. అడవుల్లో ఉండాల్సిన జంతువులన్నీ ఊర్ల మీదకు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారు.  అటవీ శాఖ అధికారులు మాత్రం ఎలాగైనా వీటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. 


చిరుత పులి కళేబరం కలకలం..


ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో చిరుత పులి కళేబరం కలకలం రేపుతుంది. కుప్పం సమీపంలోని సారెకల్‌ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరాన్ని పశువుల కాపరులు గుర్తించారు. కొద్ది‌ రోజుల క్రితం చిరుత మృతి చెందినట్లు గుర్తించిన పశువుల కాపరులు అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు.  విషయం తెలుసుకున్న అటవీ శాఖా అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుత పులి కళేబరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసిన అటవీ శాఖ సిబ్బంది, చిరుత పులి మృతికి గల‌ కారణాలపై ఆరా తీస్తున్నారు. సారెకల్‌ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా వేటగాళ్లు సంచరిస్తున్నట్లు స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు పలుకోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.