Three Youth Died in Sangareddy Accident: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు కారులో చౌటకూర్ దాబాకు వెళ్లారు. అది మూసి ఉండడంతో అదే కారులో మాసన్ పల్లి వద్ద హైవే పక్కన ఉన్న హోటల్ లో టీ తాగారు. తిరిగి వెళ్తున్న క్రమంలో బ్రిడ్జి కింద కారు ఆపి కిందకు దిగగా అటుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు వాజిద్, హాజీ, ముక్రమ్ గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా జోగిపేటకు చెందిన వారేనని.. మెకానిక్స్ గా వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Rahul Gandhi: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ! - ఆ స్థానం నుంచే బరిలో దిగుతారా?