Boy Died Who Fell From The Building In Tirupati: ఏపీ సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. మూడేళ్ల బాలుడు పై అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన తిరుపతిలో (Tirupati) జరగ్గా.. ఐదేళ్ల చిన్నారిని కారు కబళించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లాకు చిన్నచౌక్‌కు చెందిన శ్రీనివాసులు, భార్య, కుమారులు సాత్విక్ శ్రీనివాసరాజు (3), శ్రీనిహాంత్‌తో కలిసి తిరుమలకు వచ్చారు.

Continues below advertisement


గురువారం సాయంత్రం దర్శనం చేసుకోవాల్సి ఉండగా స్థానిక పీఏసీ - 5 పద్మనాభ నిలయం మొదటి అంతస్తులో లాకర్ తీసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులు తలనీలాలు సమర్పించి హాల్ వద్దకు చేరుకున్నారు. సాత్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెట్ల దారిలోని రెయిలింగ్ గ్రిల్ సందులో నుంచి జారి కింది అంతస్తులోకి పడిపోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు బాలున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చిన్నారిని కబళించిన కారు


సంక్రాంతికి తాతయ్య ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఓ మూడేళ్ల చిన్నారిని ఓ కారు కబళించిన ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి సుజాతనగర్‌కు చెందిన బోగెర్ల నీవన్‌కుమార్, మృదుల దంపతులు కుమార్తె లార్ని (5)తో పాటుగా పాతగాజువాక సెలెస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బంధువులు లక్ష్మి, సూర్యారావుల ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం సెల్లార్‌లో ఆడుకుంటానని బాలిక అడగడంతో తాతయ్య సూర్యారావు చిన్నారిని కిందకు తీసుకొచ్చారు. అదే అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటూ ఫార్మాలో పని చేస్తున్న రాజేశ్ ఆ సమయంలో కారులో సెల్లార్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారి లార్నిని కారు ఢీకొట్టింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Also Read: Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు