గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. రెండేళ్ల కిందట భార్య మృతి చెందింది. ఇద్దరు పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు. డయాబెటిస్‌తో బాధ పడుతున్న ఆయన తన ఆలనపాలన చూసుకోడానికి ఓ మహిళ తోడు ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడు. పత్రికల్లో వచ్చే వివాహ ప్రకటన చూశారు. మధ్యవర్తికి ఫోన్ చేసి కూడా మాట్లాడారు. తర్వాతే కథ మారిపోయింది.
వరుపెట్టి కాల్స్- ఫోన్‌లోనే అన్నీ
ఎప్పుడైతే పెళ్లి వివిధ నెంబర్లకు ఫోన్లు చేశారో... అప్పుడే ఆయన ట్రాప్‌లో పడ్డారు. గుర్తు తెలియని మహిళల నుంచి ఫోన్‌లు రావటం మెదలయ్యాయి. ఫోన్‌లోనే పలకరింపులు, కులశ ప్రశ్నలు వేశారు. వృద్ధుడిని నమ్మించి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు.
ఓ మహిళ ఫోన్ చేసి మాటలు కలిపింది. ముందుగా తన ఖాతాలో 3 వేల రూపాయలు జమ చేయాలని కోరింది. ఖాతాలో 3వేల రూపాయలు జమ చేసిన తరువాత ఆమె నుంచి ఓ ఫోన్ నంబర్ మెసేజ్ రూపంలో వచ్చింది. ఆ నంబర్‌కు అతను ఫోన్ చేశాడు. అలా మాటలు కలిపిన ఆమె అతనితో కలసి జీవించటానికి ఓకే చెప్పింది. కొద్దిరోజులకు తనకు లక్ష రూపాయలు అవసరం ఉందని, నగదు ఇవ్వాలని కోరింది. అతను డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె మాట్లాడటం మానేసింది.
అక్కడికి వారం రోజుల తర్వాత మరో మహిళ ఫోన్ చేసింది. జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానని, తనకు ఎవరూ లేరని చెప్పి నమ్మించింది. తనకు మాత్రం చాలా ఆస్తి ఉందని, తాను కూడా తోడు కావాలని కోరుకుంటున్నట్లు ట్రాప్‌లోకి దింపింది. కొద్దిరోజుల తర్వాత కుటుంబ అవసరాలకు లక్ష ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని ప్రేమగా కోరింది. ఇక్కడే ఆయన బొక్కబోర్లాపడ్డారు. ఆమె చెప్పిన మాటలకు కరిగిపోయిన ఆ వృద్ధుడు లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత నుంచి ఆమె ఫోన్ కట్. మోసపోయినట్లుగా ఆలస్యంగా గుర్తించారు.
నేనే...భీమవరం భామను...
కొద్ది రోజులకు భీమవరం నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. భీమవరం భానుగా పరిచయం చేసుకుంది. వివాహాల మధ్యవర్తి నుంచి నెంబర్ తీసుకున్నానని తెలిపింది. అయితే అప్పటికే ఇద్దరు హ్యాండ్ ఇవ్వటం, మోసపోవంతో సదరు వృద్ధుడు ఆమె మాటలు నమ్మశక్యం కాక పట్టించుకోవటం మానేశాడు. అయితే ఆమె మాత్రం రిపీటెడగా ఫోన్ చేయడంతో ఒకరోజు మాటలుు కలిశాయి. తనను ఇద్దరు మహిళలు మోసగించారని తన బాధను ఆమెకు వివరించాడు. తాను అలాంటి దానిని కాదని, తనకు 35 ఏళ్లకే పెళ్లయ్యిందని,అయితే భర్తలో మగతనం లేక, పిల్లలు పుట్టక విడాకులు ఇచ్చానని చెప్పింది.
తల్లిదండ్రులు లేని తాను ప్రస్తుతం బంధువులు వద్ద ఉంటున్నానని, దీంతో వారు అలుసుగా భావించి తాగివచ్చి కొడుతున్నారని కలర్ పిక్చ్ చూపించింది. ఫోన్‌లో ఏడ్చి వృద్ధుడిని బురిడీ కొట్టించింది. అమ్మమ్మ ఇచ్చిన రూ. కోట్ల ఆస్తి ఉందని, వేరే వారిని మోసం చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ ముగ్గులోకి దింపింది.
అసలే వీక్‌నెస్‌లో ఉన్న వృద్ధుడు ఆమెకు లొంగిపోయాడు. వివాహం చేసుకుంటానని ఆమె మాయమాటలు చెప్పటంతో, కొద్దిరోజులు ఫోన్‌లో సంభాషణలు నడిచాయి. వీడియో కాల్ చేయమని కోరింది. అయితే తనకు స్మార్ట్ ఫోన్ లేకపోవటంతో అతని చేయలేకపోయాడు. తర్వాత తన అమ్మమ్మ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి లక్ష కావాల్సి వచ్చిందని, నగదు ఇస్తే వారంలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది.
ఆమె మాటలు నమ్మిన అతను, తన భార్యకు చెందిన బంగారం వస్తువులు బ్యాంకులో కుదవపెట్టి డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు. బ్యాంకు ఖాతాలో వేస్తే మోసగిస్తున్నారని ఆమెను నేరుగా కలవాలని భావించాడు. దీంతో ఆ మహిళ తాను బస్సులో వస్తున్నానని, బస్టాండ్‌కు వచ్చి రిసీవ్ చేసుకోవాలని కోరింది. ఆమె చెప్పినట్లు బస్టాండ్‌కు వెళ్లగానే రిజిస్ట్రేషన్‌కు సమయం అవుతోందని, ముందు డబ్బులు ఇస్తే కట్టేసి వచ్చేస్తానంటూ చెప్పింది. అంతే నగదు తీసుకొని మాయమైంది. అప్పటి నుంచి ఆమెకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. దీంతో అతను తనకు తెలిసిన పోలీసుల ద్వారా ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.