Car Fell From Bridge Due To Wrong GPS In Bareilly: జీపీఎస్ (GPS) నావిగేషన్ తప్పిదం ముగ్గురి ప్రాణాలు తీసింది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో ఓ కారు నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన ఘటన యూపీలోని (UP) బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు జీపీఎస్ సాయంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఖల్పూర్ - దతాగంజ్ రహదారిపై వేగంగా ప్రయాణించిన కారు నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి రామగంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నావిగేషన్ పొరపాటు వల్లే నిర్మాణంలో వంతెనపైకి కారు చేరినట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలోని వంతెన ముందు భాగం నదిలో కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి జీపీఎస్‌లో మార్పు చేయకపోవడంతో నావిగేషన్ మ్యాప్‌లో తప్పుగా చూపించిందని వెల్లడించారు. అలాగే, వంతెన ప్రదేశం వద్ద కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేవని.. దీంతో కారు తప్పుదారిలో ప్రయాణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరో ఘటనలో ముగ్గురు
అటు, ఇదే యూపీలోని సంభాల్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు మృతి చెందారు. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే నిర్వహిస్తోన్న క్రమంలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది పోలీసులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతో సర్వే తలపెట్టిన బృందానికి స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వందలాది మంది స్థానికులు గుమిగూడి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పదుల సంఖ్యలో పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలికి భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.