Accident: విధి ఎంతో విచిత్రమైనది. అది ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి తలుస్తుంది. సాఫీగా సాగుతున్న జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎటు వైపు నుండి ఎప్పుడు ఎలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో మనిషి గ్రహించలేడు. అప్పటికప్పుడు జరిగిన ఘటనలు జీవితంపై పెను ప్రభావాన్నే చూపుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విధి ఆడిన వింత నాటకానికి పెను ఉదాహరణగా నిలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఇది చదివి తెలుసుకోండి.


వాళ్లు పోలీసులు.. దోషులకు శిక్ష వేయడంలో, అమాయకులకు సాయం అందించడంలో ముందు ఉంటారు. నేరాలు జరిగితే వాటిని ఛేదించి న్యాయస్థానం ముంగిట నిలుచోబెడతారు. రాత్రనక, పగలనక పనిలో నిమగ్నమవుతారు. మనం పండుగలు, పబ్బాలు అంటూ కుటుంబంతో కలిసి హాయిగా, సంతోషంగా ఉంటే వారు మాత్రం వీధుల్లో విధి నిర్వర్తిస్తుంటారు. న్యాయస్థానంలో న్యాయం అందుతుంది.. కానీ ప్రతి ఒక్కరూ న్యాయం కోసం మొదట పరిగెత్తేది  పోలీసు స్టేషన్ కే. 


విచారణ కోసం వెళ్లి విగతజీవులయ్యారు..!


అది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట. అక్కడికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో అవినాష్, అనిల్ మల్లిక్, మ్యాక్స్ వెల్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వాళ్లంతా పోలీసులు. బెంగళూరుకు చెందిన ఈ పోలీసులు గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అక్కడి నుండి తిరుపతికి బయలు దేరారు. పూతలపట్టు మండలం పి. కొత్తకోట వద్ద రైల్వే బ్రిడ్జి ఎత్తు తెలపడానికి రోడ్డు పక్కన ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశారు రైల్వే సిబ్బంది. ఆ ఇనుప స్తంభమే పోలీసుల పట్ల మృత్యు పాశంగా మారింది. ఆ ఇనుప స్తంభాన్ని తప్పించబోయి.. అక్కడే ఉన్న మరో బ్రిడ్జిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. బెంగళూరు శివాజీనగర్ ఎస్సై అవినాష్(29), కానిస్టేబుల్ అనిల్ మల్లిక్(26), డ్రైవర్ మ్యాక్స్ వెల్(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ప్రొబేషనరీ ఎస్సై దీక్షిత్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. 


నుజ్జునుజ్జయిన కారు..


ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. అందులోనే పోలీసులు మృతదేహాలు ఇరుక్కున్నాయి. జేసీబీ సాయంతో వాటిని బయటకు తీశారు. ప్రమాదంలో చని పోయిన ఎస్సై అవినాష్.. బీదర్ జిల్లా బసవ కల్యాణ తాలూకా దాసరవాడి నివాసి అని గుర్తించారు. ఇటీవలె అవినాష్ కు పెళ్లి నిశ్చయమైంది. కానిస్టేబుల్ అనిల్ మల్లిక్ బాగలకోట్ జిల్లా జమఖండి తాలూకా చిక్కళకెరే వాసి. మ్యాక్స్ వెల్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 8 మంది పోలీసులు రెండు కార్లలో బెంగళూరు నుండి తిరుపతికి బయల్దేరారు. ఆ రెండు కార్లలో ఒకదానికి ప్రమాదం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మై దుర్ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.