Suryapet Gold loot Crime : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రముఖ నగల దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ లూటీలో షాపు మొత్తం ఖాళీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్‌లో సంతోషి జువెలరీ షాపు ఉంది. దొంగలు షాపు వెనుక భాగంలోని బాత్రూమ్ గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి షాపు లోపలి భాగంలోని షట్టర్ , బీరువా ను కట్ చేసి ఆభరణాలను తీసుకెళ్లిపోయారు. ఈ రంధ్రం ద్వారా షాపు లోపలి స్టోరేజ్ సెక్షన్ వద్దకు నేరుగా వచ్చేశారు.
మొత్తంగా 18 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లుగా యజమానులు పోలీసులుకు చెప్పారు. అలాగే దుకాణంలో రూ. 22 లక్షల నగదు కూడా ఉందని చెబుతున్నారు. షాపు యజమాని కిషోర్ 18 కిలోల బంగారం, రూ. 22 లక్షల నగదు దోచుకెళ్లారని పోలీసులుక ఫిర్యాదు చేశారు. సూర్యాపేట ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఐదు స్పెషల్ టీముల్ని ఈ కేసును ఛేదించడానికి ఏర్పాటు చేశారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. షాపు లోపలి సీసీటీవీ కెమెరాలు ఎందుకు పని చేయలేదని ఆరా తీస్తున్నారు.
ప్రొఫెషనల్ గ్యాంగ్ చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాస్ కట్టర్ వాడకం , బాత్రూమ్ గోడ ద్వారా ప్రవేశించడం వంటివి సైలెంట్ గా చేయడం ప్రొఫెషనల్స్ కే సాధ్యమని భావిస్తున్నారు. ముందుగానే రెక్కీ కూడా నిర్వహించి ఉంటారని నుమానిస్తున్నారు. స్థానికంగా, వ్యాపారులు , ప్రజలు భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా జువెలరీ షాపుల్లో సీసీటీవీ కెమెరాలు , బర్గ్లర్ అలారం సిస్టమ్‌ల లోపాలపై చర్చ జరుగుతోంది.
ఇంకా నిందితులు ఎవరు అన్నది గుర్తించ లేదు. 2014లో హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూమ్‌లో 30 కిలోల బంగారం చోరీ గుర్తు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇవి కూడా గోడలకు రంధ్రాలు వేసి, గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించి చోరీ చేశారు.