Hyderabad News: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) కుమారిడికి చెన్నై కస్టమ్స్ విభాగ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనతోపాటు పలువురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని మంత్రి అయ్యారు. తాజాగా ఆయన కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హర్షారెడ్డి డైరక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీని చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించి.. విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమన్లు జారీకి అత్యంత ఖరీదైన వస్తువులను తెప్పించడమే కారణంగా తెలుస్తోంది. హర్షారెడ్డి విదేశాల నుంచి అత్యంత ఖరీదైన వాచ్‌లను తెప్పించినట్టు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.
డెంగీ జ్వరమన్న హర్షారెడ్డి
మంత్రి కుమారుడికి సమన్లు జారీ చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణకు ఈ నెల నాలుగో తేదీన హాజరుకావాలని సూచించారు. అయితే, హర్షారెడ్డి తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్టు అధికారులకు చెప్పడంతోపాటు రాలేనని స్పష్టం చేశారు. ఈ నెల 27 తరువాత హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. దీనికి చైన్నై కస్టమ్స్ అధికారులు సానుకూలతను వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రి ఇప్పటి వరకు మాట్లాడలేదు.
హాంకాంగ్ నుంచి భారత్‌కు
కస్టమ్స్ అధికారులు వాచ్‌లు కొనుగోలు వ్యవహారంపైనా ఆరోపణలు చేస్తున్నారు. హర్షారెడ్డి హాంకాంగ్‌లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచ్‌లు డీలర్ మహ్మద్ ఫహేరుద్దీన్ ముబీన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన అలోకం నవీన్ కుమార్ సింగపూర్ - చెన్నై విమానంలో గడియారాలను తీసుకువచ్చాడు. అతడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఆ వాచీలు విలువ రూ.1.73 కోట్లుగా ఉంటుందని నిర్ధారించారు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు చిక్కిన నవీన్ కుమార్ విచారణలో భాగంగా ఈ వాచ్‌లను హర్షారెడ్డి కోసం తెచ్చినట్టు చెప్పినట్టు కస్టమ్స్ అదికారులు చెబుతున్నారు. తాను హర్షారెడ్డికి, ముబీన్‌కు మధ్యవర్తిగా మాత్రమే ఉన్నట్టు నవీన్ కుమార్ చెప్పడంతో.. కస్టమ్స్ అధికారులు మంత్రి కుమారుడికి నోటీసులు జారీ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ మొత్తాన్ని బదలాయించినట్టు విచారణలో తేలింది.
చెన్నైలోని అలందూరు కోర్టు ఏప్రిల్ ఒకటో తేదీన ఇచ్చిన ఉత్తర్వులు మేరకు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతోపాటు హర్షారెడ్డిని విచారించేందుకు కస్టమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఆస్కారమిచ్చేదిగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై హర్షారెడ్డి మాట్లాడుతూ కస్టమ్స్ అధికారుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు.