NTR District TDP SC Cell President:  విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ  ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ కుటుంబ కలహాలు, తీవ్ర వేధింపుల వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ వర్మ తనపై అర్ధరాత్రి మద్యం మత్తులో భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆయన భార్య సొంగా శాంతి శ్రీ విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిత్యం వేధింపులకు గురిచేస్తూ తన ప్రాణాలకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె పోలీసులకు వెల్లడించడం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

Continues below advertisement

బాధితురాలు శాంతి శ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ వర్మ గత కొంతకాలంగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇంట్లో ప్రతిరోజూ గొడవలు పడుతూ తనపై మానసికంగా, భౌతికంగా దాడి చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సంజయ్, ఆమెతో తీవ్రంగా గొడవపడి కత్తిపీటతో దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన శాంతి శ్రీ డయల్ 112 కు కాల్ చేసి పోలీసుల సాయం కోరారు.

శాంతి శ్రీ  కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే మాచవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంజయ్ వర్మ దాడి నుంచి ఆమెను సురక్షితంగా రక్షించిన పోలీసులు, అర్ధరాత్రి సమయంలోనే ఆమెను గుడవల్లిలోని పుట్టింటికి సురక్షితంగా పంపించారు. అనంతరం శాంతి శ్రీ మాచవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భర్తపై లిఖితపూర్వక ఫిర్యాదు అందజేయడంతో పాటు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కారు.

Continues below advertisement

కన్నీరు మున్నీరుగా విలేకరులతో మాట్లాడిన శాంతి శ్రీ, తన భర్త వల్ల తన ప్రాణాలకు తీవ్ర హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా, అధికార పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న సంజయ్ వర్మ నుంచి తనకు రక్షణ కల్పించాలని, చట్టపరంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఉన్నతాధికారులను వేడుకున్నారు. గృహ హింసతో పాటు ప్రాణాపాయం కలిగిస్తున్న ఆయన దౌర్జన్యాలకు అంతం పలకాలని ఆమె డిమాండ్ చేశారు.

అధికార టీడీపీ జిల్లా హోదాలో ఉన్న నాయకుడిపైనే ఆయన భార్య నేరుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, పైగా కత్తిపీటతో దాడి చేశారని సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ పరంగా,  చట్టపరంగా సంజయ్ వర్మపై  కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.