Kurnool district News: కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన ఓ నేత దారుణమైన రీతిలో హత్యకు గురయ్యారు. జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరులో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేత వాకిటి శ్రీను (45) ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు కళ్లలో కారంచల్లి హతమార్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. 


ఈ విషయం తెలుసుకున్న వాకిటి శ్రీను ఫ్యామిలీ, ఇతర సన్నిహితులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, సీఐ జయన్న చేరుకున్నారు. వాకిటి శ్రీనుకు ఉన్న పరిచయాలు, ఇతర గొడవలు వంటి వాటి గురించి విచారణ చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా అక్కడికి చేరుకొని వాకిటి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడారు. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డీఎస్పీని కోరారు. ఎమ్మెల్యేకు ఈయన ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కీలకంగా వ్యవహరించారని.. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే.. బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. వైసీపీ నేతలే వాకిటి శ్రీనును హత్య చేసి ఉంటారని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు.