Tadepalligudem News : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడియద్దలో బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి.  ప్రమాదం సంభవించినప్పుడు బాణాసంచా కర్మాగారంలో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ బాణాసంచా కర్మాగారం అన్నవరం అనే వ్యక్తికి చెందినది పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సుమారు 5 సంవత్సరాల నుంచి కడియద్ద గ్రామంలో అన్నవరం అనే వ్యక్తి  బాణాసంచా తయారుచేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.    ఇలాంటి బాణా సంచా తయారీ ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం ప్రజలు వాపోతున్నారు. ఈ పేలుడు ధాటికి తాడేపల్లిగూడెం పట్టణం వరకూ భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు. 


హోంమంత్రి దిగ్భ్రాంతి 


తాడేపల్లిగూడెం అగ్ని ప్రమాద ఘటనాస్థలిని మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. బాధితులకు సాయం అందిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు. తాడేపల్లిగూడెం అగ్నిప్రమాద ఘటనపై  హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి... గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.  


కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం


కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామంలో ఓ రైతు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కురుమపల్లికి చెందిన గంటల రాజు అనే వ్యక్తి హార్వెస్టర్ తో వరి కోత ముగించుకొని తిరిగి వస్తుండగా  కరెంటు తీగలు తగలడంతో అక్కడికక్కడే కాలిపోయింది. అయితే అప్రమత్తమైన యువకుడు సకాలంలో స్పందించి కిందకి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది.


తమిళనాడులో ఘోర ప్రమాదం 


 తమిళనాడులో భారీ ప్రమాదం జరిగింది. మధురై జిల్లాలో ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.  ఉసిలంబట్టి సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలైనట్లు మదురై ఎస్పీ ధ్రువీకరించారు. పేలుడులో గాయపడిన 10 మందిని జిల్లాలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమగా గుర్తించారు. ఈ బాణసంచా కర్మాగారం వలైయప్పన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం బాణాసంచా ఫ్యాక్టరీ యజమాని వలైయప్పన్ అని పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతోంది.