Surat builder dies on daughter wedding day : గుజరాత్‌లోని సూరత్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి తుషార్ ఘేలానీ తన కుమార్తె పెళ్లి రోజే మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాహ వేడుకలు జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జోలీ బ్రాండ్ పేరుతో సూరత్‌లో అనేక నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించిన తుషార్ ఘేలానీకి ఫిబ్రవరి 5న తన కుమార్తె తన్వి వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 1వ తేదీన వివాహ ఖర్చులు , అతిథుల జాబితా విషయంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులకు కొదవ లేకపోవడంతో అత్యంత భారీగా పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఈ అంశంపై కుటుంబంలో తీవ్రమైన వివాదాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తుషార్ ఘేలానీని వెంటనే స్థానిక మహావీర్ ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ మెదడులోకి దూసుకుపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు శస్త్రచికిత్స చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం వైద్యులు ఆయనను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ఈ కష్టకాలంలోనూ ఆయన కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. తుషార్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించింది. కుమార్తె పెళ్లి జరగాల్సిన ఫిబ్రవరి 5 ఉదయం అవయవాల సేకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రి బెడ్‌పైనే మరణించారు. దీనివల్ల కాలేయం, చేతుల దాన ప్రక్రియ సాధ్యపడలేదు, కేవలం ఆయన కళ్లను మాత్రమే సేకరించగలిగారు. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో సూరత్ వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది.
తుషార్ ఘేలానీ సూరత్ క్రెడాయ్ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కుమార్తె పెళ్లి కోసం విదేశాల నుంచి వచ్చిన బంధువుల మధ్యే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది. ఉమ్రా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
