Supreme Court acquits Surendra Koli in Nithari case: ఉత్తరప్రదేశ్ నోయిడా నిథారి విలేజ్‌లో 2006లో జరిగిన భయానక సీరియల్ హత్యల కేసులో ప్రధాన ఆరోపితుడు సురేంద్ర కోలి నిర్దోషి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చివరి పెండింగ్ కేసులో కూడా కోలి విడుదల చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుతో, 19 సంవత్సరాల పాటు జరిగిన న్యాయపోరాటం ముగిసింది. ముఖ్య న్యాయమూర్తి బీ.ఆర్. గవాయ్, న్యాయమూర్తులు సూర్య కాంత్, విక్రమ్ నాథ్‌ల బెంచ్, కోలి క్యూరేటివ్ పిటిషన్‌ను అనుమతించి, అతని మరణశిక్షను రద్దు చేసింది. "క్యూరేటివ్ పిటిషన్ అనుమతించామని" కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మిగిలిన అన్ని కేసుల్లో కోలి నిర్దోషిగా తేలడంతో, అతను జైలు నుంచి బయటపడనున్నారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో 38 మంది ఎక్కువగా పిల్లలు అదృశ్యమయ్యారు. నిథారి కిల్లింగ్స్ 2005-2006 మధ్య జరిగాయి. ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-31లోని నిథారి విలేజ్‌లో వ్యాపారవేత్త మోహిందర్ సింగ్ పంధేర్ ఇంటి వెనుక డ్రైన్‌లో మానవ ఎముకలు, మాంసం ముక్కలు కనుగొనడంతో కేసు బయటపడింది. డిసెంబర్ 29, 2006న ఎనిమిది మంది పిల్లల ఎముకలు బయటపడ్డాయి. రెండు సంవత్సరాల్లో 38 మంది పిల్లలు, యువత కనుమరుగయ్యారని తేలింది. పంధేర్ ఇంట్లో పనిచేసిన సురిందర్ కోలి ను 2007లో అరెస్టు చేశారు. కోలి స్వయంగా 16 మంది పిల్లలను హత్య చేసి, వారి మాంసాన్ని వండి తిన్నానని ఒప్పుకున్నాడు. పంధేర్‌పై ఇమ్మోరల్ ట్రాఫికింగ్, మర్డర్ ఆరోపణలు వచ్చాయి.
కేసు సీబీఐకి అప్పగించారు. మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. మొదట్లో, 2009-2011 మధ్య ట్రయల్ కోర్టులు కోలికి మరణశిక్షలు విధించాయి. 2011లో సుప్రీం కోర్టు 15 ఏళ్ల అమ్మాయి రేప్, మర్డర్ కేసులో మరణశిక్షను ధృవీకరించింది. 2014లో రివ్యూ ప్లీ తిరస్కరించారు. 2015లో అలహాబాద్ హైకోర్టు మరణశిక్షను జీవిత శిక్షగా మార్చింది, మెర్సీ పిటిషన్‌లో జాప్యం కారణంగా.. మిగిలిన 16 కేసుల్లో మూడు కేసుల్లో క్లోజర్ రిపోర్టులు, మూడు కేసుల్లో నిర్దోషి తేలారు.
2023 అక్టోబరులో అలహాబాద్ హైకోర్టు కోలిని 12 కేసుల్లో, పంధేర్‌ను 2 కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు లోపభూయిష్టమైనది అని, సాక్ష్యాలు రీజనబుల్ డౌట్ మేరకు రుజువు కావని తేల్చింది. 2017 ట్రయల్ కోర్టు మరణశిక్షలను కొట్టివేసింది. సీబీఐ, బాధితుల కుటుంబాలు సుప్రీంకు అప్పీల్స్ చేశాయి. 2024 జులై 30న సుప్రీం కోర్టు 14 అప్పీల్స్‌ను తిరస్కరించింది. చివరి కేసులో కోలి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీం కోర్టు తీర్పులో, మిగిలిన కేసుల్లో సాక్ష్యాలు లోపించాయని, ఇదే సాక్ష్యాలతో కోలి నిర్దోషిగా తేలడంతో చివరి కేసులో కూడా నిర్దోషిగా తేల్చడం అవసరమని పేర్కొంది.