Crime News :  కరప్షన్. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగుల్లో..రాజకీయ నేతల్లో ఉంటుంది. నేరుగా పట్టుబడినా చాలా మంది రాజకీయ నేతలు ప్రతిపక్షాల కుట్ర అని తప్పించుకుంటారు. జైలుకెళ్లి అదే రీతిన నవ్వుకుంటూ వస్తారు. అన్నీ వదిలేసిన రాజకీయ నేతలకే అది సాధ్యం. వారికి జేజేలు కొట్టేవారుంటారు అది వేరే విషయం. కానీ ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ..అవినీతి పాల్పడే అధికారులు మాత్రం అలా ఉండలేరు. క్షణం క్షణం భయంగా గడుపుతూ ఉంటారు. బరి తెగించిన అవినీతి పరుల సంగతి పక్కన పెడితే..  చాలా మంది మనస్సాక్షిని కూడా చంపుకోలేరు. అలాంటి ఓ ఎమ్మార్వో విషాదాంతమే ఇది.


షేక్పేట్  మాజీ ఎమ్మార్వో సుజాత గుండెపోటుతో మృతి చెందారు. ఈమె మాజీ ఎందుకయ్యారంటే...ఓ అవినీతి కథ ఉంది. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.14లోని దాదాపు రూ. 40 కోట్ల విలువైన 4,865 చదరపు గజాల స్థలం ఉంది. ఆ  విషయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డి, షేక్ పేట్ అప్పటి వీఆర్ఓ  సుజాత అవినీతికి పాల్పడి ఇతరులకు ధారదత్తం  చేసేందుకు ప్రయత్నించారు.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన అధికారులు2020 జూన్ 8న  సుజాతను ఏపీబీ అధికారులు అరెస్టు చేశారు. గాంధీనగర్‌లోని సుజాత ఇంట్లో సోదాలు నిర్వహించగా బంగారు ఆభరణాలతో పాటు రూ.30 లక్షలు దొరికాయి. అయితే తన ఇంట్లో పట్టుబడిన రూ.30 లక్షలకు సంబంధించిన వివరాలను సుజాత చెప్పలేకపోయారు. అవన్నీ తన జీతం డబ్బులని చెప్పారు. అయితే అది అవినీతి సొమ్మేనని ఏసీబీ అధికారులు నిర్దారించారు. 


  సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో కలత చెందిన ఆమె భర్త అజయ్ కుమార్ 2020 జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని తన సోదరి ఇంటి ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన అజయ్ కుమార్.. గాంధీ నగర్లోని మాధవ మాన్షన్ ఫ్లాట్ నెంబర్ 404లో భార్య సుజాతతో కలిసి ఉండేవారు. అయితే సుజాతపై అవినీతి ఆరోపణలు రావడం, ఏసీబీ సోదాల్లో ఇంట్లో రూ. 30లక్షలు స్వాధీనం చేసుకోవడం, ఆమె అరెస్ట్ నేపథ్యంలో అజయ్ కొంతకాలం పాటు చిక్కడపల్లిలోని తన సోదరి వద్ద ఉన్నాడు. ఏసీబీ అధికారులు అతనిని సైతం విచారణకు పిలవడంతో భయాందోళనలకు గురైన ఆయన బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు కేసుల పాలై.. ఇటు భర్తనీ సుజాత పోగొట్టుకున్నారు. 


అప్పటనుంచి డిప్రెషన్‌లో ఉన్న సుజాత తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. తరవాత ప్రభుత్వం కూడా ఆమె సస్పెన్షన్ ఎత్తి వేసింది.  తిరిగి విధుల్లో చేరే అవకాశమిచ్చినా ఆమె నిరాకరించారు. చివరికి  గుండెపోటు రావడంతో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అవినీతి చేసి.. దొరికిపోవడంతో ఆమె కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది..చివరికి తన ప్రాణాలను కూడా నిలబెట్టుకోలేకపోయారు.