Hyderabad Road Accident | కోహెడ: హైదరాబాద్ శివారు ప్రాంతంలో హిట్ అండ్ రన్ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అబ్దుల్లా పూర్ మెట్  కోహెడలో బైకును కారు ఢీకొన్న అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బీఫార్మసీ విద్యార్థిని మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని కోహెడలో  హిట్ అండ్ రన్ కేస్ శుక్రవారం ఉదయం జరిగింది. ఘట్కేసర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్పందన (19), సాయి అనే యువకుడు బైకు మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన స్కోడా వారు వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పందన అక్కడికక్కడే చనిపోగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోస్టుమార్గం కోసం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుతో డ్రైవర్ పరారయ్యే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు. కారు నెంబర్ AP.40.BD.6669 అని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన విద్యార్థిని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా. కాగా, నిందితుడ్ని తెనాలికి చెందిన ప్రదీప్ అని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. 

నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

నగరంలో మరో హిట్ అండ్ రన్ జరగడం కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ అనే యువకుడు అతివేగంగా స్కోడా కారు నడిపాడు. ఈ క్రమంలో కోహెడ వద్ద అతివేగంతో బైకును ఢీకొట్టాడు.  ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతిచెందగా, బైకుపై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారుతో పారిపోతుండగా నిందితుడ్ని చైతన్యపురి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దం పగిలి ఉండటంతో పాటు, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో చైతన్యపురి పోలీసులు కారు ఆపి నిందితుడు ప్రదీప్ వర్మను ప్రశ్నించారు. 

నిందితుడ్ని పట్టించిన రక్తపు మరకలు

కారు డ్యామేజ్ అయ్యింది సార్.. అందుకే రిపేర్ చేయిందడానికి వెళ్తున్న అని బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అనుమానించి నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో, హిట్ అండ్ రన్ కేసుగా చైతన్యపురి పోలీసులు గుర్తించారు. హిట్ అండ్ రన్‌కు పాల్పడింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ అని, మద్యం మత్తులో స్కోడా కారును డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రదీప్ ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు చైతన్యపురి పోలీసులు.