Sons Attacked On Her Father For Marriage In kurnool: తమకు 40 ఏళ్లు వచ్చినా వివాహం చేయడం లేదని.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఇద్దరు కుమారులు కన్నతండ్రిపైనే కర్కశంగా ప్రవర్తించారు. ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని (Kurnool District) గోనెగండ్లలో (Gonegandla) శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నేసే మంతరాజు, ఆదిలక్ష్మి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం కాగా.. మిగిలిన ముగ్గురికీ కాలేదు. ఈ క్రమంలో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. పిల్లల వివాహాలు పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమారులు కుల పెద్దలతో కలిసి పలుమార్లు పంచాయతీ సైతం పెట్టించారు.


తండ్రి కాళ్లు విరగ్గొట్టారు


ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం సైతం పెద్దల మధ్య కొడుకులు పంచాయతీ పెట్టారు. పంచాయతీ జరుగుతుండగా ఆగ్రహావేశాలకు లోనైన కుమారులు తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మంతరాజు రెండు కాళ్లు విరిగిపోయాయి. పంచాయతీ పెద్దలు వారించేందుకు ప్రయత్నించినా కొడుకులు వినలేదు. చివరకు కొడుకుల నుంచి తండ్రిని విడిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పి.. తండ్రిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గొడవ జరిగిన మాట వాస్తవమేనని గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.


Also Read: Srikakulam News: టెక్నాలజీ సాయంతో గంజాయి కట్టడి చేస్తున్న శ్రీకాకుళం పోలీసులు- రంగంలోకి డ్రోన్‌లు