Kadapa Crime News | కడప: డబ్బులివ్వలేదన్న చిన్న కారణంతో ఓ కుమారుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. తండ్రిని గదిలో బంధించి, తల్లిని హత్య చేసిన తరువాత ఫోన్లో పాటలు వింటూ పైశాచిక ఆనందం పొందాడు.ఈ దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

Continues below advertisement


బీటెక్ చేసి, సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు 
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఉప్పలూరు లక్ష్మీదేవి (52), విజయభాస్కర్‌రెడ్డి దంపతులు. లక్ష్మీదేవి ఈశ్వర్‌రెడ్డినగర్‌ జడ్పీ హైస్కూళ్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. విజయభాస్కర్‌రెడ్డి గతంలో ప్రైవేట్ జాబ్ చేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు.  వీరికి ఏకైక కుమారుడు యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఉన్నాడు. యుశ్వంత్ మూడేళ్ల కిందట చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న యశ్వంత్ కు ఉద్యోగం చేయాలని లేదు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. జాబ్ చేయాలని తల్లిదండ్రులు పదే పదే సూచించేవారు.


హైదరాబాద్‌లో ఉంటున్న యశ్వంత్ రూం రెంట్,  ఇతర ఖర్చుల కోసం ప్రతినెలా తల్లి డబ్బులు పంపేవారు. గతనెల డబ్బులు ఆలస్యం కావడంతో తల్లికి ఫోన్ చేస్తే ఆమె రూ.3,000 పంపారు. అంతలోన మరో 10,000 రూపాయలు కావాలని అడగగా ఇవ్వడానికి ఆమె నిరాకరించారు. అధిక ఖర్చులు చేయవద్దని వారించారు. అసలే సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, మరోవైపు డబ్బులు ఇవ్వకపోవడంపై తల్లిపై కోపం పెంచుకున్నాడు.  ఆదివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు.


ఇంటికి రాగానే తల్లి లక్ష్మీదేవితో గొడవకు దిగి దాడి చేశాడు. ఆమె భర్త విజయభాస్కర్‌ రెడ్డి బెడ్‌రూం నుంచి బయటకు వస్తుంటే కుమారుడు యశ్వంత్ ఆయనను రూంలోకి నెట్టివేసి తలుపు గడియపెట్టాడు. డబ్బులు పంపలేదన్న కోపంతో ఉన్న యశ్వంత్ కత్తితో తల్లి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి బయట వరండాలో పడేసి.. ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫోన్లో పాటలు వింటూ కూర్చున్నాడు.


లక్ష్మీదేవి అరుపులు విన్న పక్కింటి వారు అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.  విజయభాస్కర్‌ రెడ్డిని బయటకు తీసుకువచ్చి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ట్రీ టౌన్  పోలీస్‌స్టేషన్ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. కొన్ని రోజుల నుంచి యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.