Couple from Siddipet commits suicide in Bengaluru: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దంపతుల జీవితం విషాదాంతమైంది. తన భర్త గదిలో విగతజీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయిన భార్య, అదే అపార్ట్‌మెంట్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. సోమవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులు ఇద్దరూ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందినవారు.
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన కుంట భాను చందర్ రెడ్డి బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ ఐబీఎం సంస్థలో టెక్కీగా పనిచేస్తున్నారు. సోమవారం భాను చందర్ తన గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన షాజియా, తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించింది.
గది తలుపులు బద్దలు కొట్టి చూడగా, భాను చందర్ రెడ్డి అప్పటికే ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన షాజియా, తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆ ఆవేదనలో భర్త మృతదేహాన్ని చూసిన కొద్ది నిమిషాల్లోనే ఆమె అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ జంట మరణాలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అసహజ మరణాలుగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరోగ్య సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన ఈ యువ దంపతులు ఇలా తనువు చాలించడం వారి స్వస్థలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
