Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ తండ్రి తన కూతురి మృతదేహాన్ని చూసిన క్షణాల్ని మళ్లీ మళ్లీ తలుచుకుని కుమిలిపోతున్నారు. ఆ స్థితిలో తనని చూసి నోట మాట రాలేదని, గుండె ముక్కలైపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాత్రి ఏం జరిగిందో వెక్కి వెక్కి ఏడుస్తూనే అంతా వివరించారు. ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పారని, కానీ అక్కడికి వెళ్లాక పరిస్థితి చూసి కుప్ప కూలిపోయామని చెప్పారు. 


"నాకు రాత్రి 11 గంటలకి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 12 గంటలకు మేం హాస్పిటల్‌కి చేరుకున్నాం. కానీ అప్పుడు మాకేమీ చెప్పలేదు. ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మాకేమీ అర్థం కాలేదు. దాదాపు మూడు గంటలు అక్కడే ఉన్నాం. 3.30 గంటలకు వచ్చి డెడ్‌బాడీ చూసుకోవాలని అన్నారు. నేను ఒక్కడినే లోపలికి వెళ్లాను. ఆ క్షణం నా కూతురిని ఆ స్థితిలో చూసి గుండె పగిలిపోయింది. ఒంటిమీద నూలుపోగు లేదు. ఓ బెడ్‌షీట్ చుట్టి పెట్టారు. కాళ్లు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఓ చేయి తన తలపై ఉంది"


- బాధితురాలి తండ్రి


ఇదంతా వింటుంటేనే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తున్నాయి. తండ్రిగా ఆయన ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో! అయినా సరే తల్లిదండ్రులు అసలు ధైర్యం కోల్పోలేదు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. "మాకంటూ మిగిలింది ఇంకేమీ లేదు. అయినా సరే మాకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తాం. న్యాయం జరుగుతుందున్న భరోసా ఉంది" అని చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బాధితురాలి తండ్రి. నిన్నటి వరకూ ఆమెపై ఎంతో నమ్మకం ఉండేదని, కానీ ఇప్పుడు పూర్తిగా విశ్వాసం కోల్పోయామని తేల్చి చెప్పారు. 


"నిన్న మొన్నటి వరకూ మమతా బెనర్జీపై మాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు న్యాయం చేయాల్సిన ఆమే న్యాయం జరగాలంటూ పోరాటం చేస్తున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. తలుచుకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇదేమీ చేయడం లేదు"


- బాధితురాలి తండ్రి